పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్ ! సినిమాలూ, రాజకీయానికీ బ్యాలెన్స్ ! అమరావతి కేంద్రంగానే..
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను గద్దెదించాలనే పట్టుదలతో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తాజా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటివరకూ రాజకీయాలు, సినిమాల్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్న పవన్.. ఇప్పుడు ఆ సందిగ్ధతకు దాదాపు తెరదించేశారు. రెండురోజులుగా మంగళగిరి పార్టీ ఆఫీసులోనే ఉంటూ పవన్ తన ఫైనల్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.
ఏపీలో మరో 9 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రాజకీయాలపై పూర్తిస్దాయిలో ఫోకస్ పెట్టాల్సిన పరిస్ధితి పవన్ కళ్యాణ్ కు ఉంది. అదే సమయంలో ఆర్ధికంగా ఇబ్బందుల్లేకుండా చూసుకునేందుకు సినిమాల్నీ కొనసాగించాల్సిన పరిస్దితి. దీంతో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేలా కొత్త ప్లాన్ ను పవన్ కళ్యాణ్ రెడీ చేసుకున్నారు. రెండు రోజులుగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలోనే పాగా వేసిన పవన్...ఈ మేరకు తన నిర్మాతలు, దర్శకులతో చర్చించారు.

పవన్ ప్రస్తుతం రాజకీయాలపై సీరియస్ గా దృష్టిపెట్టాల్సిన పరిస్దితుల్లో అటు టాలీవుడ్ లో తననే నమ్ముకున్న నిర్మాతలు, దర్శకులను ఇబ్బంది పెట్టే పరిస్ధితి లేదు. దీంతో వారిని నేరుగా పిలిపించుకుని మాట్లాడిన పవన్.. ఓ బ్యాలెన్స్ ఫార్ములాకు రూపకల్పన చేశారు. దీని ప్రకారం ఇకపై మంగళగిరిలోనే ఉంటూ ఈ చుట్టు పక్కన ప్రాంతాల్లోనే షూటింగ్స్ చేయాలని పవన్ నిర్ణయించారు. అలాగే ప్రస్తుతానికి గోదావరి జిల్లాల్లో మొదలుపెడుతున్న వారాహి యాత్రకు హాజరై, అనంతరం తిరిగి షూటింగ్స్ లో పాల్గొనేలా పవన్ షెడ్యూల్ సిద్ధమవుతోంది.

పవన్ అమరావతి కేంద్రంగా అంటే విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కొంతకాలం పాటు షూటింగ్స్ చేసేందుకు వీలుగా అనువైన లొకేషన్స్ ను నిర్మాతలు, దర్శకులు తాజాగా పరిశీలించారు. ఇందుకు తగినట్లుగా సినిమాల్లో స్కిప్ట్, స్టోరీ, లొకేషన్స్ సెట్ చేసే పనిలో వారు బిజిగా ఉన్నారు.

ఈ మేరకు క్షేత్రస్దాయిలో పరిశీలన జరిపిన తర్వాత పవన్ కు వారు ఓ రిపోర్ట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా అమరావతి చుట్టు పక్కల ప్రాంతాల్లో షూటింగ్స్ కు వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు హరీష్ శంకర్ ఓ ప్రకటన కూడా చేశారు. త్వరలో ఇక్కడ షూటింగ్స్ ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications