పవన్ కల్యాణ్ ఒంటరిగానా: చిరును డామినేట్ చేస్తారా?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త పార్టీ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కూడికలు, తీసివేతలపై రాజకీయ పరిశీలకులు, ఆయా పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. జనసేనతో ముందుకొస్తున్న పవన్... రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలలో పోటీ చేస్తారు? ఎన్ని సీట్లు గెలుచుకుంటారు? తన సోదరుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఇమేజ్ ముందు నిలబడతారా? మెగా అభిమానులు చిరుకు కాదని ఆయనకు మద్దతు పలుకుతారా? రెండుగా చీలుతారా? ఇలాంటి అంశాలపై జోరుగా చర్చ సాగుతోంది.
2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధానంగా సీమాంధ్ర ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర, పవన్ కల్యాణ్ జనసేన పార్టీలు వస్తున్నాయి. కిరణ్ పార్టీ ప్రభావం అంతగా ఉండదని భావించినప్పటికీ... పవన్ ప్రభావం మాత్రం ఎక్కువగానే ఉంటుందంటున్నారు.

పవన్ పక్కా ప్రణాళికతో రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. తన సోదరుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి నాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్... జోరుగా ప్రచారం చేశారు. అయితే, పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేయడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోయారు. దీంతో తన సోదరుడి వల్ల కానిది... తాను చేయాలని పవన్ ఆరాటపడుతున్నారట. ఇందుకోసమే పార్టీ పెడుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్‌కు మాజీ పిఆర్పీ శ్రేణులు ఎంత మేరకు బాసటగా నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది. నాటి పిఆర్పీ ముఖ్య నేతలు ఇప్పటికే ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ముఖ్య నేతల నుండి పవన్‌కు సహకారం ఉండకపోవచ్చు. పవన్‌కు ఉన్న ఇమేజ్ కారణంగా కొందరు ఆయన దరికి చేరే అవకాశాలు లేకపోలేదు.
ఒంటరిగానా..?
పవన్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక భావస్వారుప్యం కలిగిన పార్టీలతో కలిసి పోటీ చేస్తుందా అనే చర్చ కూడా సాగుతోంది. లోక్ సత్తా, ఎఎపి, టిడిపిలలో ఆయన చేరుతారనే ప్రచారం గతంలో జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన భావసారుప్యం కలిగిన పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో దిగే అవకాశముందంటున్నారు.
చిరును ఢీకొంటారా?
పవన్ సోదరుడు అయిన చిరంజీవిని కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రచార సారథిగా నియమించింది. దీంతో ఇప్పుడు పవన్, చిరు ఇమేజ్‌ల మధ్య పోటా పోటీ ఉండబోతుంది. అభిమానులు ఎవరికి మద్దతు పలుకుతారు, యువత ఎటు వైపు ఉంటుంది, ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications