జగన్ పై దాడి బాధ్యులతోనే విచారణా ? సిట్ పై ఈసీ జోక్యం కోరిన పవన్..!
ఏపీలో రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న సీఎం వైఎస్ జగన్ పై రాయి దాడి ఘటన ఎన్నికల వేళ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. అదే సమయంలో ఈ ఘటనపై దర్యాప్తు కోసం వైసీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఇందులో నియమించిన అధికారులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్ పై దాడి ఘటనకు బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులతో సిట్ ఏర్పాటు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనపై ఏర్పాటు చేసిన సిట్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. హిందీలో చేసిన ఈ ట్వీట్ ను ఆయన బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికీ ట్యాగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని పవన్ ఇందులో ప్రశ్నించారు. వీవీఐపీ కేటగిరీలో ఉన్నారనే కదా జగన్ ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి, చెట్లు కొట్టేసేవారని గుర్తుచేసారు. గతంలో ఇలాంటి సభలన్నీ పట్టపగలే నిర్వహించారు కదా అని గుర్తుచేశారు.

మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారని పవన్ ప్రశ్నించారు. పరదాలూ కట్టలేదు, చెట్లూ కొట్టలేదన్నారు. ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించీ విచారణ చేయించాలన్నారు. వాళ్ళు తీసుకున్న భద్రత చర్యల్లో లోపాలు ఏమిటని ప్రశ్నించారు.
आंध्र प्रदेश के मुख्यमंत्री पर पथराव से हुए हमले के मामले की जांच उन अधिकारियों से कैसे की जाए जो इसके लिए जिम्मेदार हैं? वे वीवीआईपी श्रेणी में हैं। इस कारण उक्त शासक जब भी किसी सरकारी कार्यक्रम में जाते तो पर्दे बाँध देते... और पेड़ काट देते। सब कुछ दिन के उजाले में किया…
— Pawan Kalyan (@PawanKalyan) April 15, 2024
ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలని పవన్ డిమాండ్ చేశారు. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులక రాయి విసిరిన చేయి, ఆ చేయి వెనక ఉన్నదెవరో బయట పడుతుందన్నారు. సూత్రధారులు, పాత్రధారులెవరో తేలుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే భద్రతా లోపాలు బయటపడ్డాయని పవన్ గుర్తుచేశారు.
ఇలాంటి అధికారులు ఉంటే ప్రధాని మోడీ మళ్లీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారన్నారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరని ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications