ఆ ఇద్దరెవరు?: ఆ ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ నిప్పులు
హైదరాబాద్/విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాటి తన ప్రసంగంలో ఇద్దరు ఎమ్మెల్యేల గురించి వారి పేర్లు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. దీనిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. పవన్ విమర్శించిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
గురువారం విశాఖలో ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ... తాను డబ్బు కోసం సినిమాల్లో నటిస్తుంటే... వారు మాత్రం మోసం, దోపిడీ కోసం నటిస్తారని ఆరోపించారు. డబ్బు కోసం ఎంతటికైనా తెగించే వారిద్దరూ చివరి వరకూ మన వెనుకే ఉంటూ మనకే వెన్నుపోటు పొడిచారన్నారు.

కొత్త రాజధాని ఏర్పాటు విషయంలో వీరిద్దరు వ్యంగ్యంగా మాట్లాడుకోవడం తాను వార్తలలో చూశానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించే ఇటువంటి నాయకులను నిలదీయాలని పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువతకు పిలుపునిచ్చారు.
'ప్రజలకు సంపూర్ణ క్రాంతి అందించడమే జనసేన అజెండా. పార్టీకి ఇజం పుస్తకమే మేనిఫెస్టో. పార్టీ గుర్తుగా ఉన్న నక్షత్రాలలో ఆరు కోణాలుంటాయి. ఒక్కో కోణం ఒక్కో సిద్ధాంతానికి నిదర్శనం. చట్టాలు ఎవరికీ చుట్టాలు కారాదు. ధనవంతుడికో రీతి.. పేదవాడికో రీతి ఉండవద్దు. ఇలాంటి వివక్ష వల్ల నిజాయితీగా వ్యవహరించే సిబిఐ, పోలీసు అధికారులు బలి పశువులు అవుతున్నారు. లక్ష్మీ నారాయణ ఉదంతమే ఇందుకు నిదర్శనం' అని పవన్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications