పవన్ కళ్యాణ్: టీలో ఫెయిల్, సీమాంధ్రలో హిట్
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ వ్యూహం తెలంగాణలో విఫలమై, సీమాంధ్ర ఫలితం సాధించిందా అనే ప్రశ్నించుకుంటే అవుననే సమాధానం వస్తుంది. పవన్ కళ్యాణ్ మంత్రం కాంగ్రెసును చావు దెబ్బ తీయగా, సీమాంధ్రలో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసును వెనక్కి నెట్టింది.
తెలంగాణలో కాంగ్రెసు హటావో - దేశ్ బచావో అనే నినాదం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై, ఆయన కూతురు కవితపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెరాసలోనే కాదు, తెలంగాణలో కెసిఆర్ కుటుంబం ఆధిపత్యం ఉందనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు గానీ తెలంగాణ ప్రజలకు సమర్థమైన నాయకత్వాన్ని అందించే నాయకుడిగా మాత్రం కెసిఆర్ కనిపించారు. దాన్ని బద్దలు కొట్టడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారు. పైగా, తెలంగాణలో పవన్ కళ్యాణ్ కెసిఆర్‌కు ప్రత్యామ్నాయం చూపించలేకపోయారు.
సీమాంధ్రకు వచ్చేసరికి అందుకు భిన్నంగా వ్యవహరించారు. వైసిపి హఠావో, సీమాంధ్ర బచావో అంటూ నినాదం తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నమ్మించే విధంగా ఉన్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో సాగిన భూదందాల విషయం ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లింది. దానికితోడు, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని ఆయన నేరుగా ప్రజలను కోరారు. చంద్రబాబు నాయకత్వ సామర్థ్యంపై సీమాంధ్రలోనే కాదు, తెలంగాణలో కూడా విశ్వాసం ఉంది.

తెలంగాణకు వచ్చేసరికి చంద్రబాబును ప్రజలు తెలంగాణ వ్యతిరేకిగా, సీమాంధ్ర పక్షపాతిగా చూశారు. దానికితోడు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెసు కనిపిస్తోంది. తెచ్చిన పార్టీగానే కాదు, తెచ్చిన తర్వాత తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటామో కెసిఆర్ పదే పదే చెప్పిన విషయాలు ప్రజల్లో నాటుకుపోయి ఉన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మంత్రం తెలంగాణలో ఫలించలేదు. పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయనను సీమాంధ్ర పక్షపాతిగా చూడడానికి అవకాశం కల్పించాయి.
తెలంగాణవాదం బలంగా ఉన్న వరంగల్ లోకసభ స్థానంలో పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా తెరాస అభ్యర్థి కడియం శ్రీహరి ఘన విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో కమ్మ వర్గం ప్రాబల్యం ఉందని భావిస్తున్న తరుణంలో కాపు వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేశారు. కులం లేదని చాటి చెప్పారు. అది చంద్రబాబుకు సీమాంధ్రలో బాగా కలిసి వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రమే కాకుండా ఇతర వర్గాలను కూడా ఆకట్టుకోవడంలో ఆయన విజయం సాధించారు.












Click it and Unblock the Notifications