పవన్ సెల్ఫ్ గోల్ - తెర వెనుక, జగన్ కు వరంగా..!!
పవన్ కల్యాణ్. 2024 ఎన్నికల సమయంలో ఒక రాజకీయ సంచలనం. కూటమి అధికారంలోకి రావటానికి ప్రధాన పాత్ర. ప్రధాని మోదీ సైతం పవన్ అంటే సునామీ అంటూ ప్రశంసలు. పవన్ లేకపోతే కూటమికి అధికారం లేదని అందరూ అంగీకరించిన విషయం. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం. ఎన్నికల సమయంలో ప్రతీ హామీ అమలు.. అందరి భద్రతకు తనదే బాధ్యత అంటూ ప్రచారం. నమ్మిన ప్రజానీకం. పట్టం కట్టిన తరువాత ఏం జరిగింది. ఏడాది కాలం లో పవన్ ఏం సాధించారు. ఏ మేర సక్సెస్ అయ్యారు. పవన్ త్యాగరాజుగా మిగిలిపోయారా.. వరుస తప్పిదాలతో నష్టపోతున్నారా.. అసలు ఏడాది కాలంలో పవన్ సాధించిందేంటీ..
మారుతున్న లెక్కలు
2024 ఎన్నికల ముందు పవన్ ఏం చెప్పినా సంచలనమే. వైసీపీకి ధీటుగా.. టీడీపీకి మద్దతుగా పవన్ నిలిచిన తీరుతో కూటమికి బలం పెరిగింది. కూటమి ఇచ్చే ప్రతీ హామీ అమలు బాధ్యత తనదే అంటూ చెప్పిన మాటలు ఓటర్లు విశ్వసించారు. అవినీతి జరగదని చెప్పిన విషయాలను ప్రజలు నమ్మారు. పవన్ ఉంటే టీడీపీ సైతం ఎలాంటి తప్పులు చేయకుండా పాలన చేస్తుందని.. తమ పార్టీకి ఎదిగే అవకాశం వచ్చిందని జనసైనికులు.. పవన్ అభిమానులు భావించారు. అయితే, ఏడాది కాలంలో సీన్ రివర్స్ అయింది. పవన్ ఏం మాట్లాడుతారో.. ఎక్కడ నిలదీస్తారో అనే భయం తొలుత టీడీపీ నేతల్లో కనిపించేది. అయితే, ఆ పట్టు పవన్ కోల్పోయారు. పదే పదే చంద్రబాబు సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆయన మద్దతు దారులకు నచ్చలేదు.

వరుస తప్పిదాలు
పవన్ డిప్యూటీ సీఎంగా తొలి రోజుల్లో ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రజావాణి నిర్వహించారు. పలు సమస్యల పై స్పందించారు. తిరుమలలో తొక్కిసలాట జరిగితే క్షమాపణ కోరారు. బోర్డుతోనూ చెప్పించారు. శాంతి భద్రతల విషయంలో ప్రజల సమక్షంలోనే హోం మంత్రిని నిలదీసారు. ఆ తరువాత క్రమేనా పవన్ పట్టు కోల్పోయారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా.. టీడీపీ కంటే ఎక్కువగా మద్దతుగా నిలుస్తున్నారు. తన పార్టీ కంటే.. చంద్రబాబు, లోకేష్ భవిష్యత్ కోసమే పవన్ ఆసక్తి చూపుతున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. పిఠాపురంలో దళితుల బహిష్కరణ వంటి అంశా లు .. వరుసగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనల విషయంలో పవన్ మౌనంగా ఉండటం ఆయన్ను అభిమానించిన వారికి నచ్చటం లేదు. పవన్ మాత్రం మౌనం వీడటం లేదు. పవన్ ప్రస్తుత శైలి జగన్ కు వరంగా మారుతోంది.
సెల్ఫ్ గోల్
కూటమి లో బీజేపీ సైతం భాగస్వామ్య పార్టీగా ఉంది. అవసరానికి మించి ఎప్పుడూ చంద్రబాబు అండ్ టీం ను ప్రశంసించ లేదు. పవన్ తీరు భిన్నంగా ఉంది. ఏడాది కాలంలో పార్టీ బలోపేతం కోసం ఒక్క సమావేశం నిర్వహించ లేదు. నామినేటెడ్ పదవుల్లోనూ పార్టీ కోసం పని చేసిన వారికి న్యాయం జరగటం లేదని చెబుతున్నారు. అటు లోకేష్ ప్రభుత్వంలో బలం పెంచుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కంటే.. మంత్రిగా ఉన్న లోకేష్ కే ప్రాధాన్యత పెరుగుతోంది. లోకేష్ కోసం పవన్ త్యాగాలు చేస్తున్నారనే వాదన కూటమి నేతల్లోనే వినిపిస్తోంది. వైసీపీ నేతల పైన వరుస కేసుల విషయంలో ఇప్పటి వరకు పవన్ స్పందించ లేదు. సినిమా పరిశ్రమ పైన చేసిన వ్యాఖ్యల పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కూటమి ఎమ్మెల్యేల పైన తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పవన్ ఏం చేస్తున్నారనే ప్రశ్న వినిపిస్తోంది. ఇలా.. ఏడాది కాలంలో సమాధానం చెప్పుకునే స్థాయిలో ఉన్న పవన్.. వచ్చే నాలుగేళ్ల కాలంలో ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications