పవన్ కల్యాణ్ టార్గెట్... ఆ ఏడుగురు??
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏడుగురు నేతలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత కొద్దికాలం గ్యాప్ తీసుకొని ఆ తర్వాత దూకుడుగా రాజకీయం చేస్తున్న పవన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, మాజీ మంత్రులే లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ లేని రాష్ట్రాన్ని చూడాలని, అవసరమైతే పొత్తులకు సిద్ధమంటూ ప్రకటించారు.

బలాలు, బలహీనతలు తెలుసుకుంటున్నారు
జనసేన నేతల అభిప్రాయం ప్రకారం పవన్ కల్యాణ్ వైసీపీకి చెందిన అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేశారని, వీరు కూడా పదే పదే పవన్ పై పదునైన విమర్శలు చేస్తుండటంతో ఈసారి ఎన్నికల్లో వీరిని ఓడించడానికి పవన్ గట్టిగానే కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వారివారి బలాలు, బలహీనతలను ఎప్పటికప్పుడు తమ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానుల ద్వారా కూడా తెప్పించుకుంటున్నారని, తద్వారా ఏం చేయాలనేదానిపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

ఒక మాట మీదే ఉంటాం
కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి మంత్రులుగా ఉన్న సమయంలో వపన్ పై దూకుడుగా విమర్శలు చేసేవారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా అంబటి రాంబాబు 175 స్థానాల్లో పోటీచేస్తున్నారో? లేదో తేల్చుకోవాలంటూ వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. చేనేత వస్త్రాల ఛాలెంజ్ ను కూడా ఆయన అపహాస్యం చేసేలా మాట్లాడారని, ఆయన ఈసారి ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసినా జనసైనికులంతా ఒక మాటమీద ఉంటామని స్పష్టం చేస్తున్నారు.

కొడాలి నానినే ప్రత్యేకంగా..
పవన్ ప్రత్యేకంగా టార్గెట్ చేసిన నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో కూడా గుడివాడను పేకాట అడ్డాగా మార్చారని, ఇసుక దందాకు నిలయంగా మారిందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో అందరికన్నా ఎక్కువగా కొడాలి నానినే ఓడించాలనే లక్ష్యంతో పవన్ ఉన్నట్లు జన సైనికులు చెబుతున్నారు. అసందర్భమైన ప్రేలాపలనతోపాటు ప్రజలన తప్పుదోవ పట్టించేలా ఈ నేతల వ్యవహారశైలి ఉండటంతోపాటు పదే పదే పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తుండటంతో వీరందరినీ ఓడించాలనే దృక్పథంతో జనసేనాని ఉన్నారు.












Click it and Unblock the Notifications