పవన్ కళ్యాణ్ టార్గెట్ కెసిఆర్, జగన్, చిరంజీవి?
హైదరాబాద్: తమ హవాకు తిరుగు ఉండదని భావిస్తున్న ముగ్గురు రాష్ట్ర నాయకులను జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్ష్యం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అన్నయ్య చిరంజీవి మీద పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో అనురాగాన్ని కురిపించినా, కాంగ్రెసుపై తిరుగులేని దాడి పెట్టారు. కాంగ్రెసు హఠావో, దేశ్ బచావో అనే నినాదం ఇచ్చారు. కాంగ్రెసును సీమాంధ్రలో కాపాడడానికి చిరంజీవి పూనున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసును వ్యతిరేకిస్తూ చిరంజీవిని సమర్థించడం అనేది జరిగే విషయం కాదు.
కాంగ్రెసు అధిష్టానం పెద్దల వల్లనే చిరంజీవికి ఆ స్థితి వచ్చిందని చెబుతున్న పవన్ కళ్యాణ్ తన అన్నయ్యను బయటకు రావాలని మాత్రం పిలువలేదు. దాంతో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు మధ్య సీమాంధ్రలో మాటల యుద్ధం తప్పదని భావిస్తున్నారు. బహిరంగ సభల్లో ఇరువురు ఒకరి గురించి మరొకరు నేరుగా విమర్శలు చేసుకోకపోయినా మీడియా సమావేశాల్లో వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పకతప్పదు.

కాగా, తెలంగాణలో ప్రధాన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. తెలంగాణలో తనకు ఇమేజ్ ఉందని, తగిన అభిమాన సంపద ఉందని ఆయన భావిస్తున్నట్లు ఉన్నారు. తెలంగాణలో బిజెపి, తెలుగుదేశం కూటమి ఓటు బ్యాంక్ పెంచడం ద్వారా కాంగ్రెసును దెబ్బ తీయాలనే ప్రయత్నాలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై పవన్ కళ్యాణ్‌కు పీకల దాకా ఆగ్రహం ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. తెలంగాణపై అనురాగం కన్నా ఆయన మాటల్లో కెసిఆర్‌పై, ఆయన నాయకత్వంలోని తెరాసపై కోపమే ఎక్కువగా కనిపించింది.
ఇక, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తప్పకుండా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా మారే అవకాశం ఉంది. రాయలసీమలో జగన్‌ను దెబ్బ తీయగలిగితే సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అధికారంలోకి రాకుండా చూడవచ్చుననే ఎత్తుగడతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు కనిపిస్తున్నారు. రాయలసీమలో చాలా మంది కాంగ్రెసు నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఈ సీనియర్ నేతలు జగన్ హవాను ఎదుర్కోగలరా అనేది అనుమానంగానే ఉంది.
రాయలసీమలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ జగన్ పార్టీకి వచ్చే ఓట్ల శాతాన్ని తగ్గించవచ్చునని చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు. ఇరు ప్రాంతాల్లోనూ బిజెపి, తెలుగుదేశం అవకాశాలను పెంచుతూ తాను లోకసభ ఎన్నిక కావడానికి, తనకు ఆరంగేట్రం సిద్ధం చేసిన పొట్లూరి వరప్రసాద్‌కు బెర్త్ ఖాయం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications