జనసేనకు ఏడాది.. ఇంకా ప్రశ్నలు: పవన్ కళ్యాణ్ పోటీపై సస్పెన్స్?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి నేటికి ఏడాది పూర్తయింది. ఆయన మార్చి 14, 2014న జనసేనను స్థాపించారు. ఈ సందర్భంగా పవన్ తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తన పార్టీకి, తనకు నిర్మాణాత్మక సూచనలు ఇచ్చి మీడియా సహకరించిందని తెలిపారు. అయితే, జనసేన పార్టీ పైన ఇప్పటికీ చాలామందిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పార్టీ స్థాపించి ఏడాది గడుస్తున్నప్పటికీ... ఇప్పటి వరకు స్పష్టమైన క్యాడర్ గానీ, కమిటీలు కాని లేవని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా, ఎన్నికలలో పోటీ ఎప్పటి నుండి అనేది ఇంకా ప్రశ్నగానే మిగిలిందని చెబుతున్నారు.
గత ఏడాది పార్టీ ప్రారంభించిన సమయంలో... సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సహా.. పలుచోట్ల ఆయన పార్టీ సభ్యులు పోటీ చేస్తారనే వాదనలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఆయన బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. నాటి ప్రచారం సమయంలోనే... పవన్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గురించి మాట్లాడారు.

తాము గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడనేది స్పష్టత లేకపోయినప్పటికీ.. త్వరలో ఎప్పుడైనా జరగవచ్చు. అయినప్పటికీ ఇప్పటికీ జనసేనకు ఎలాంటి కమిటీలు లేకపోవడం, పోటీ పైన స్పష్టత లేదని అంటున్నారు.
సనత్ నగర్ నుండి పోటీ చేస్తారా?
ఇటీవల కొత్త వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సనత్ నగర్ నియోజకవర్గం నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్ మాట్లాడుతూ.. అవసరమైతే తానే త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని చెప్పారు. దీంతో అతను లేదా జనసేన పార్టీ పోటీ చేయవచ్చునని అంటున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుండి గెలిచి తెరాసలో చేరారు. ఇప్పుడు ఆయన మంత్రి అయ్యారు. దీంతో ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తే సనత్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో టీడీపీ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.
అయితే, పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేస్తే బాగుంటుందని టీడీపీ, బీజేపీలు కూడా భావిస్తున్నాయి. పవన్ పోటీ చేస్తే తెరాసను గట్టిగా ఢీకొంటారని, తలసాని చిత్తవుతారని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అప్పుడే పోటీకి దిగుతారా అనే అనుమానాలు లేకపోలేదు. టీడీపీ అభ్యర్థికి పవన్ మద్దతుగా మాత్రం నిలబడవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications