పవన్ పోటీ నియోజకవర్గాల ఖరారు, రెండు చోట్ల - బీజేపీ మార్గదర్శకం..!!
జనసేనాని పవన్ ఎక్కడ పోటీ చేయబోతున్నారు. బీజేపీ - జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్దుల తొలి జాబితా ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు ఖరారు చేసారు. పవన్ గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఓడిపోయారు. ఈ సారి పవన్ భీమవరం నుంచి మరోసారి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. కానీ, ఇప్పుడు పవన్ నిర్ణయం మారింది. రెండు స్థానాలకు పోటీ చేయనున్నారు. అయితే..రెండు ఎమ్మెల్యే స్థానాలు కాదు.
పవన్ నియోజకవర్గం: పవన్ కల్యాణ్ ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్ల నుంచి తన పార్టీ అభ్యర్దులను బరిలోకి దింపటానికి నిర్ణయించారు. అదే విధంగా మూడు ఎంపీ స్థానాలు ఖరారయ్యాయి. పవన్ కల్యాణ్ భీమవరం నుంచి ..మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయటం ఖాయమని వార్తలు వచ్చాయి.

కానీ, పవన్ ఆలోచన మారినట్లు తెలుస్తోంది. భీమవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పులిపర్తి రామాంజనేయులు జనసేన నుంచి ఈ సారి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఈ సారి గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో ఎక్కువ సీట్లు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎంపీ సీట్లలో కాకినాడ, అనకాపల్లి, మచిలీపట్నం ఎంపిక తీసుకున్నట్లు సమాచారం.
రెండు చోట్ల పోటీ: పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనే పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ, తాజాగా భీమవరం పర్యటన సమయంలో తాను పోటీ చేస్తున్నానని...సహకరించాలని పవన్ కోరారు. ఇప్పుడు అభ్యర్దుల జాబితా మార్పు తరువాత వస్తున్న స్పందనలతో పవన్ అప్రమత్తం అయ్యారు. అదే సమయంలో బీజేపీ నేతల నుంచి పవన్ ను ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.
దీంతో..పిఠాపురం అసెంబ్లీతో పాటుగా అనకాపల్లి నుంచి పవన్ ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ, గోదావరి జిల్లా నేతలు మాత్రం కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగటం ద్వారా ఆ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేగా పోటీ చేయటం రెండు రకాలుగా కలిసి వస్తుందని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ముందు జాగ్రతగా: గోదావరిలో ఎమ్మెల్యేగా..ఉమ్మడి విశాఖలో ఎంపీగా పోటీ చేయటం ద్వారా రెండు జిల్లాల్లోనూ ప్రభావం ఉంటుందనేది మరో విశ్లేషణ. దీని ద్వారా రెండు జిల్లాల్లోనూ మెజార్టీ సీట్లు సాధించవచ్చనే అంచనాలతో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయటం పైన ఇప్పటికే చంద్రబాబుతోనూ పవన్ చర్చించినట్లు సమాచారం. రెండు జిల్లాలకు చెందిన నేతలతో చర్చించిన తరువాత పవన్ తన నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
పవన్ ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయించటం ద్వారా ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా అటు కేంద్రంలో..ఇటు రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా కీలక భూమిక పోషించేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు స్ఫష్టం అవుతోంది. దీంతో పవన్ పోటీ నియోజకవర్గాల పైన తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications