"వారాహి" తో యాత్రకు పవన్ కల్యాణ్ సిద్దం - సెంటిమెంట్ పాటిస్తూ ఈ నెల 24న..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. తన వారాహి ద్వారా ప్రజల్లోకి రావాలని నిర్ణయించారు. ఇందు కోసం ఇప్పటికే తన ప్రచార రధం తో కదలి వచ్చేందుకు తొలి అడుగు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ వారాహి గురించి ప్రకటన చేసిన సమయం నుంచి పెద్ద ఎత్తున రాజకీయంగా విమర్శలు వచ్చాయి. దీనికి పవన్ సీరియస్ గా స్పందించారు. తాను వారాహితోనే ఏపీలోని ప్రతీ ప్రాంతానికి వస్తానని ప్రకటించారు. ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తే తానేంటో చూస్తారంటూ హెచ్చరించారు. టీడీపీతో జనసేన పొత్తు ఖారరైందంటూ ప్రచారం సాగుతున్న వేళ పవన్ కల్యాణ్ వారాహి ద్వారా యాత్ర మరింతగా రాజకీయ ఉత్కంఠను పెంచుతోంది.
పవన్ కల్యాణ్ ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడ నుంచే వారాహిని ప్రారంభించాలని పవన్ నిర్ణయించారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తెలంగాణ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.

తెలంగాణ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని ఇప్పటికే పవన్ నిర్ణయించారు. అదే సమయంలో అనుష్టువ్ నరసింహ యాత్రను చేపట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని నరసింహస్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ధర్మపురి నరసింహస్వామి ఆలయంలో ఈ యాత్రకు పేరు పెట్టనున్నారు.
పవన్ కల్యాణ్ కు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం అంటే ప్రత్యేక సెంటిమెంట్. 2009లో ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ ప్రమాదం నుంచి బయట పడ్డారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు పవన్ ను తాకాయి. ఆ సమయంలో పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామి కృపతోనే బయట పడ్డానని పవన్ నమ్మకం. అప్పటి నుంచి ఆ దేవాలయం పైన పవన్ కు నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు తన ఎన్నికల యుద్దానికి సిద్దం అవుతున్న సమయంలో వారాహితో తొలి పూజ.. తొలి అడుగు అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications