పిఠాపురంలో ఆటోలో పవన్ కళ్యాణ్.. జనసేనాని సింప్లిసిటీకి ఓటర్లు ఫిదా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సైరన్ మోగింది. దీంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఇక ఎన్నికల ప్రచార పర్వంలో రసవత్తర ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలను మెప్పించే, ఒప్పించే పనిలో పడిన నాయకులు రకరకాల చర్యలతో వారిని ఆకట్టుకుంటున్నారు.
జగన్ నమ్మకం ఇలా.. కూటమి ధీమా అలా..
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తూ, ఆ సంక్షేమ పథకాలను అందుకున్న ప్రతి ఒక్కరి ఓటు తన ఖాతాలో పడుతుందని దృఢంగా నమ్ముతున్నారు. అయితే సంక్షేమపథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారని ప్రచారం చేస్తూ, వైసిపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకు వెళుతూ ప్రజలు తమకు పట్టం కడతారని నమ్ముతున్నారు టిడిపి, జనసేన, బీజేపీలు.

జగన్ టార్గెట్ గా షర్మిల
మరోవైపు ఈసారి ఎన్నికల సమరంలో మేము సైతం అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడుగా ముందుకు కదులుతుంది. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధినేత్రి వైయస్ షర్మిల తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుంది.ఎన్నికల సమయంలో ప్రజలతో మమేకం కావటానికి అన్ని పార్టీలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రచారపర్వంలో దూకుడు.. ఆటోలో ప్రయాణం చేసిన జనసేనాని
ఇందులో భాగంగా ప్రచార పర్వంలో ప్రజల వద్దకు వెళ్లి వారితో కలిసిపోతూ మేము మీ వాళ్ళమే అని చెప్పే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆటోలో ప్రయాణం చేశారు. ఆటోవాలాలతో, ప్రజలతో మమేకమయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆటోలో ప్రయాణం చేస్తూ నేను మీ వాడినే అని చెప్పే ప్రయత్నం చేశారు.

సామాన్యుల్లో సామాన్యుడిలా పవన్ కళ్యాణ్
పిఠాపురంలో ఓ ఇంటివద్ద నవారు మంచం పై కూర్చుని అక్కడి ప్రజలతో ముచ్చటించారు. ఓ పసి పాపని ఎత్తుకొని ఆడించారు. మీకోసమే జనసేనాని ఎన్నికల కురుక్షేత్రం లోకి దిగాడని, ఆదరించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఆటోలో ప్రయాణం చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పిఠాపురం ఎన్నికల ప్రచారంలో ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్ ..!!#PawanKalyan #JANASENA #Pithapuram #ApElections2024 #AndhraPradeshElections2024 #Oneindiatelugu pic.twitter.com/R48EF8XfVs
— oneindiatelugu (@oneindiatelugu) April 2, 2024
పవన్ సింప్లిసిటీకి అభిమానులు ఫిదా
పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ ని పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ కొనియాడుతున్నారు. ఆయన పలకరింపుతో అక్కడి ఓటర్లు సైతం తెగ సంబరపడుతున్నారు. వైయస్ జగన్ కి పవన్ కళ్యాణ్ కి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని, జగన్ ఎప్పుడు ర్యాంప్ వాక్ లు చేయడం తప్ప, సామాన్యులలో కలిసిపోయాడా అంటూ ప్రశ్నిస్తున్నారు జనసేనాని అభిమానులు.












Click it and Unblock the Notifications