సీఎం జగన్ నవ రత్నాలు - పవన్ కళ్యాణ్ నవ సందేహాలు : వైసీపీ ప్లీనరీ వేళ వైరల్..!!
వైసీపీ ప్లీనరీ ప్రారంభ వేళ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ రాజకీయంగా డిబేట్ కు కారణమవుతోంది. 2017 లో పార్టీ ప్లీనరీ వేదికగా నవరత్నాలను ప్రకటించిన జగన్.. ఆ తరువాత మేనిఫెస్టోలో వాటినే పొందుపర్చి ..అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్నారు. అయితే, అందులోని లోపాలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ పథకాల వారీగా ప్రశ్నలు సంధించారు. రైతు భరోసా ద్వారా 64 లక్షల మందికి మేలు చేస్తామని చెప్పి 50 లక్షల మందికే అమలు చేయటం నిజం కాదా అని ప్రశ్నించారు.
ఒక్కో పథకంలో లోపాలను ప్రశ్నిస్తూ
మూడేళ్లలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 700 మందికే పరిహారం ఇవ్వటం నిజం కాదా అంటూ నిలదీసారు. అమ్మ ఒడి పథకం 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి..83 లక్షల మందికి ఇచ్చినట్లుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. పెన్షనర్ల జాబితా నుంచి 5 లక్షల మందిని తొలిగించటం నిజం కాదా అంటూ పవన్ తన ట్వీట్ లో నిలదీసారు. 2018-19 లో మద్యం ఆదాయం రూ 14 వేల కోట్లు ఉండగా, 2021-22లో ఆ మొత్తం రూ 22 వేల కోట్లకు చేరింది. మీ పాలనలో మద్యపాన నిషేధం అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తూ..ఈ ఆదాయం చూపించే రూ 8 వేల బాండ్లు అమ్మలేదా అని ప్రశ్నించారు.

పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది
పోలవరం ప్రాజెక్టును యుద్ద ప్రాతిపదికన ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా అంటూ తన ట్వీట్ లో పవన్ అడిగారు. ఆరోగ్య శ్రీ పథకం నుంచి ఆస్పత్రులు ఎందుకు తప్పుకుంటున్నాయంటూ నిలదీసారు. సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్య ఖర్చులు ఎందుకు చెల్లించటం లేదో చెప్పాలన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ చేయకపోవటం వలన విద్యార్ధుల హాల్ టిక్కెట్లు ఆపేస్తున్నమాట నిజం కాదా అంటూ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. పేద విద్యార్ధులకు ఫీజు చెల్లింపు ఎందుకు నిలిపివేశారని నిలదీసారు. పేదలందరికీ ఇళ్లు పేరిట చెరువుల్లో..గుట్టల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిన మాట నిజం కాదా చెప్పాలన్నారు.

ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలంటూ
ఇంటి నిర్మాణానికి నిధులు ఎందుకు మంజూరు చేయలేదంటూ పవన్ అడిగారు. పొదుపు సంఘాల సంఖ్య ను ఏటేటా లక్షల సంఖ్యలో ఎందుకు తగ్గిస్తున్నారని అడగటంతో పాటు.. అభయ హస్తం నిధులు రూ 2 వేల కోట్లు ఎమయ్యాయో చెప్పాలని పవన్ నిలదీసారు. వైసీపీ ప్లీనరీ వేళ..ఈ నవరత్నాల అమలు పైన చర్చ చేయనున్నారు. తీర్మానాలు సిద్దం చేసారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఈ వివరాలతో చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications