గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ విశ్వాసం నింపుతున్న జనసేనాని: పాడేరులో షాక్, వారి హెచ్చరిక
Recommended Video

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు విశాఖపట్నం జిల్లా పాడేరులో గిరిజన సంఘాల నుంచి నిరసన సెగ తాకింది. జనసేనాని పర్యటన నేపథ్యంలో గిరిజన సంఘాల నేతలు కొందరు సమావేశమయ్యారు. ఆదివాసీ రిజర్వేషన్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
బోయ, వాల్మీకి, మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై పవన్ వైఖరేమిటో చెప్పాలని, ఆ తర్వాతే తమ ప్రాంతాల్లో పర్యటించాలని గిరిజన సంఘాల నేతలు కొందరు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జనసేనాని ఇప్పుడు విశాఖలో పర్యటిస్తున్నారు. పాడేరులో ఆయన గిరిజన యువతను, గ్రామాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే.

కాఫీ తోటల పైనే ఆధారపడి జీవనం
బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి గిరిజనులు చేసే పోరాటానికి తను తోడుగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు. మన్యం పర్యటనలో భాగంగా అరకులోయ మండలంలోని వ్యూపాయింట్ వద్ద బాక్సైట్ కొండలను పరిశీలించారు. అనంతరం అనంతగిరి మండలంలోని బాక్సైట్ ప్రభావిత గ్రామమైన బీసుపురాన్ని సందర్శించారు. గ్రామస్థులతో మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాల వల్ల వారికి కలిగే నష్టాలను గ్రామస్థులు వివరించారు. తవ్వకాలు జరిగితే కాఫీ, మిరియాల తోటలకు తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు. కాఫీ తోటలపైనే ఆధారపడి తమ జీవనం సాగిస్తున్నామన్నారు.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డుకున్నారు
గింజలు అమ్మడంతో పాటు తోటల్లో కూలి పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్నామని పవన్‌కు తెలిపారు. తవ్వకాలు చేపడితే తాము సహించబోమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు తమ గ్రామాన్ని సందర్శించి బాక్సైట్ తవ్వకాలు చేయబోమన్నారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చి తవ్వకాలు జరుపుతామని వారు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను మీకు మద్దతుగా పోరాటం చేస్తా
దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. బాక్సైట్‌కు సంబంధించి గిరిజనులంతా పోరాటాన్ని సాగించాలన్నారు. నేను కూడా మీకు మద్దతుగా పోరాటం చేస్తానని చెప్పారు. అలాగే ఉపాధి హామీ పథకంలో చేసిన పనులకు సంబంధించి కూలి సొమ్ము ఏడాది గడుస్తున్నా ఇంకా చెల్లించలేదని గ్రామస్థులు తెలిపారు. కాఫీ ప్రోత్సాహక సొమ్ము 2015లో చెల్లించాల్సిన దానిని కూడా ఇంకా చెల్లించలేదన్నారు.

బాక్సైట్ తరలింపుకే కొత్తవలస-కిరండూల్ రైలు మార్గం డబ్లిక్ పనులు
అంతకుముందు వ్యూపాయింట్ వద్ద బాక్సైట్ కొండలను పవన్‌కళ్యాణ్ పరిశీలించారు. బాక్సైట్ ఖనిజం తరలింపునకే కొత్తవలస-కిరండూల్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేస్తున్నారని గిరిజన యువత తెలిపారు. బీసుపురం గ్రామంలో అడుగుపెట్టిన పవన్‌కు గిరిజన సంప్రదాయ రీతిలో మహిళలు నుదుట తిలకం దిద్ది, పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగాలని వ్యూపాయింట్ వద్ద పర్యటకులు పోటీపడటంతో కొంత తోపులాట చోటుచేసుకుంది.

ఇలా వచ్చి అడిగిన వారు లేరు
పవన్ స్థానికుల సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న నేపథ్యంలో ఆయనకు ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటి వరకు ఏ నాయకుడు తమ ఊరికి వచ్చి కష్టసుఖాలు అడగలేదని, కానీ ఈ బాబు వచ్చి అడిగాడని జనాలు చెబుతున్నారని, అతడు తప్పకుండా తమకు మేలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో ఉన్న పవన్ అక్కడి గిరిజన యువతీయువకులతో సమావేశం నిర్వహించి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వారు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు కృషి చేస్తానన్నారు.
గర్భిణులు పడుతున్న అవస్థలు చూసి కరిగిపోయారు. వైద్యం అందక వారు పడుతున్న కష్టాలపై స్పందించారు.












Click it and Unblock the Notifications