లోకేష్‌ను సీఎం చేస్తే ఊరుకోను, దమ్ముంటే రా!: పవన్ హెచ్చరిక, చిరంజీవి రాజకీయాలపై తేల్చేశారు
విశాఖపట్నం: పెదరుషికొండలో జనసేన కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీని ఎన్టీఆర్ స్థాపించినప్పటి నుంచి అదే నాయకులు కొనసాగుతున్నారని చెప్పారు. కొత్తతరం, యువతకు అవకాశమివ్వడం లేదని ఆరోపించారు. జవాబుదారీతనం, కొత్త రాజకీయ వ్యవస్థ కోసమే జనసేన పార్టీని స్థాపించానని ఆయన తెలిపారు.
Recommended Video

వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు భావజాలం లేదని, మనకు బలమైన (జనసేనః భావజాలం ఉందన్నారు. ఏదైనా సమస్య పైన మనం పోరాడితేనే ప్రభుత్వం అప్రమత్తం అవుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తూతూమంత్రంగా ప్రెస్ మీట్లు పెట్టి, సీఎంవోలో సమీక్షలతో సరిపెట్టుకుంటున్నారని విమర్శించారు.

ఏ విషయంలోనైనా చంద్రబాబు, లోకేష్‌లతో చర్చకు సిద్ధం
ఏ నియోజకవర్గమైనా, ఏ సమస్య పైన అయినా, ఏ పాలసి పైన అయినా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు. సమస్యల పైన అధ్యయనం చేశాకే తాను ప్రజలలోకి వచ్చానని చెప్పారు. మీకు దమ్ముంటే నారా లోకేష్‌తో రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలని సవాల్ చేశారు.

లోకేష్‌తో పోటీ చేయించు, ఎవరు గెలుస్తారో చూద్దాం
మంత్రి నారా లోకేష్‌కు పోటీగా తాను ఒకరిని నిలబెడతానని, ఎవరు గెలుస్తారో చూద్దామని పవన్ సవాల్ చేశారు. దొడ్డిదారిన లోకేష్‌ను మంత్రిగా చేశారని విమర్శించారు. తన కొడుకును ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. లోకేష్ సూత్రం ప్రకారం.. డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని, రైతు కొడుకు రైతు కావాలని, ఇంజినీరింగ్ కొడుకు ఇంజినీరింగ్ కావాలని, సీఎం కొడుకు సీఎం కావాలన్నారు. లోకేష్ సీఎం అయి మన నెత్తిమీద ఎక్కి తొక్కాలా అని మండిపడ్డారు.

రజనీకాంత్, కమల్ హాసన్‌ల రాజకీయంపై పవన్
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ సినీతారల రాజకీయాల గురించి మాట్లాడారు. ఓ నటుడికి రాజకీయాల్లో రాణించడం అంత సులువైనపని కాదన్నారు. తమిళ సూపర్‌స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం గురించి ఆయన స్పందించారు. ఓ నటుడికి రాజకీయ నేత అవడం కష్టమైన విషయమన్నారు. పార్టీ స్థాపించి దానిని నడిపించడం అంత సులువు కాదన్నారు. ప్రతిపక్షాలు ఎంతగానో విమర్శిస్తుంటాయని, రజనీ, కమల్ ఎటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కాబట్టి భారతదేశ రాజకీయాలకు వారు ఓ కొత్త రూపు కల్పిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

చిరంజీవి రాజకీయ జీవితంపై తేల్చేసిన పవన్
నటీనటులు కాస్త ఎమోషనల్‌గా ఉంటారని పవన్ అన్నారు. 2009లో తన అన్నయ్య చిరంజీవి సునామీలా రాజకీయాల్లోకి వచ్చారని, కానీ రాజకీయ పార్టీని నడిపించాలంటే మానసిక దృఢత్వం కూడా ఉండాలన్నారు. అన్నయ్యకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పుడు లేదన్నారు. ఆయన సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications