టిడిపి, బిజెపి కసరత్తు: హైదరాబాద్‌లో పవన్ రోడ్‌షో!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల తరపున జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్‌తో నగరంలోని పలు చోట్ల రోడ్‌షోలు నిర్వహించేందుకు టిడిపి, బిజెపి పార్టీలు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఏప్రిల్ 27న రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
పవన్ కళ్యాణ్ బిజెపి, టిడిపి తరపున ప్రచారంలోకి దిగితే గ్రేటర్ పరిధిలోని ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరుగుతుందని ఇరు పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రచారంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే టిడిపి అభ్యర్థుల తరపున ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గ్రేటర్ పరిధిలోని పలుచోట్ల రోడ్ షోలు నిర్వహించిన విషయం తెలిసిందే.

చంద్రబాబు నాయుడు ప్రచారానికి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తమ పార్టీ తరపున ప్రచారం చేస్తే తమకు మరింత అనుకూలంగా పరిస్థితులు మారతాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మల్కాజిగిరి నుంచి లోకసభ అభ్యర్థిగా బరిలో ఉన్న లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు ఇప్పటికే పవన్ తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, విజయవాడ ఎంపి సీటు విషయంలో టిడిపితో వచ్చిన విభేదాల కారణంగా పవన్ కళ్యాణ్ పలుచోట్ల ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను నిలిపే అవకాశం ఉంది. దీంతో టిడిపికి మద్దతుగా పవన్ ప్రచారం చేస్తారా లేదా అనే విషయం అనుమానంగా మారింది. అయితే బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్న పవన్ కళ్యాణ్, బిజెపి తరపున ప్రచారం చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications