పవన్ కల్యాణ్ టాప్ ప్రయారిటీ అదే
Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ క్రమంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్.. ఉండవల్లిలోని తన అధికారిక నివాసంలో ప్రతి శనివారం ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తూ వస్తోన్నారు. ప్రజలను ముఖాముఖిగా కలుసుకుంటోన్నారు. స్థానికంగా వారు ఎదుర్కొంటోన్న సమస్యలను అడిగి తెలుసుకుంటోన్నారు. వాటిని పరిష్కరించేలా అక్కడికక్కడే ఆదేశాలను జారీ చేస్తోన్నారు.

పవన్ కల్యాణ్.. జనవాణి పేరుతో ఇలాంటి కార్యక్రమాన్నే చేపట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చేబ్రోలులో గల పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఈ ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ఆరంభమౌతుంది. శనివారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
ఈ అయిదు రోజులూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. దీనికోసం పవన్ నివాసంలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పవన్ కల్యాణ్‌కు అందజేస్తారు.
అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కల్యాణ్.. ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. తిరుపతి, మంగళగిరి, భీమవరం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం.. వంటి పలు నగరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రజలను నేరుగా కలుసుకున్నారు. అధికారంలో లేకపోయినా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు.
టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత ఏర్పాటు కానున్న రెండో జనవాణి కార్యక్రమం ఇది. అధికారంలోకి వచ్చిన తొలి రెండు వారాల వ్యవధిలోనే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు పవన్ కల్యాణ్. ఉప ముఖ్యమంత్రి హోదాలో మంగళగిరిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీన్ని మరింత విస్తృతం చేసేలా చర్యలు తీసుకుంటోన్నారు.












Click it and Unblock the Notifications