టీడీపీ ఆధిపత్యం చర్చ వేళ.. జనసైనికులకు తేల్చేసిన పవన్..!
ఏపీలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి పార్టీల్లో తాజాగా చిచ్చు రేగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ఉత్తరాంధ్రలో టీడీపీ ఎమ్మెల్యేల చేతిలో జనసేన క్యాడర్ నలిగిపోతోదంటూ ఓ సర్వే నిపుణుడి ట్వీట్, మరోవైపు జనసేన కీలక నేత నాగబాబు ముందే ఓ కార్యకర్త ఆవేదన చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే అడ్డుకోవడం, వీటికి ముందే నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరుగుతుందని రోడ్డెక్కిన జనసేన ఇన్ ఛార్జ్ టీవీ రామారావు సస్పెన్షన్ వంటి పరిణామాలు చిచ్చు రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కూటమిలోని మూడు పార్టీల క్యాడర్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కూటమిలో చీలికలు తెచ్చి ఐక్యతను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. కూటమిలో ఐక్యత దెబ్బతీసేందుకు వైసీపీ నేతలు ఎంతో ప్రయత్నం చేస్తారని, మనం జాగ్రత్తగా ఉండాలంటూ కూటమి పార్టీల క్యాడర్ కు పవన్ సూచించారు.

కూటమిలోని మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు చిన్నచిన్న పొరపొచ్చాలు ఉన్నా మీ స్ధాయిలోనే పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని వారిని పవన్ కోరారు. తద్వారా అభివృద్ధిలో వెనుకబడ్డ ఏపీ తిరిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని వారికి సూచించారు. కనీసం 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమిలో నేతల ప్రయత్నం వల్లే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని పవన్ తెలిపారు.

కూటమిలో కీలకమైన జనసేన నేతల్ని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, అలాగే జనసేన ఎమ్మెల్యేల్ని సైతం టీడీపీ ఇన్ ఛార్జులు లెక్కచేయడం లేదన్న విమర్శల నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జనసేన కార్యకర్తలు, నేతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఇప్పటికే తక్కువ చేసి చూపుతూ సర్దుకుపోవాలని కోరుతున్న పవన్.. ఇప్పుడు నేరుగా మూడు పార్టీల క్యాడర్, నాయకులు మీ స్ధాయిలోనే గొడవలు పరిష్కరించుకోవాలని చేసిన సూచన చర్చనీయాంశమవుతోంది. ఈ సూచన జనసైనికుల్ని ఉద్దేశించి చేసిందే అన్న వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications