జైలుపై చెప్పలేదా: జగన్‌కు కేశవ్, బాబుతో నేవీ చీఫ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండేళ్లే ఉంటుందని జ్యోతిష్యులు చెప్పారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మంగళవారం మండిపడ్డారు. రెండేళ్లలో జగన్ జైలుకు వెళ్తాడని జ్యోతిష్యులు చెప్పలేదా అని ప్రశ్నించారు.
టీడీపీ ప్రభుత్వం రెండేళ్లు కాదని, మరో 20 ఏళ్లు ఉంటుందన్నారు. వైసీపీ నుండి ఒక్కో నేత చేజారుతుంటే వారిని రక్షించుకోవడం కోసం జగన్ ఇలా మాట్లాడుతున్నారన్నారు. రాజధాని పేరుతో ఏపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్న జగన్ ఆరోపణలకు సమాధానంగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది వైయస్ రాజశేఖర రెడ్డి అండ్ కో అన్నారు. దాని ఫలితంగా జగన్ కేసులు ఎదుర్కొంటున్నారన్నారు.
చంద్రబాబుతో నావీచీఫ్ ధావన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో నావీ చీఫ్ ఆర్కే ధావన్ మంగళవారం ఉదయం సచివాలయంలో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలు పాటు జరిగిన భేటీలో తూర్పు తీర ప్రాంత భద్రత, సముద్ర జలరవాణాలో అంతర్జాతీయ రవాణాను పెంపొందించే అంశాలపై వారు చర్చించారని సమాచారం.
ఇటీవల తీర ప్రాంతాల ద్వారా ఉగ్రవాదులు చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో తీర ప్రాంత భద్రతపై నేవీచీఫ్ దృష్టి సారించారు. ఈ క్రమంలో చంద్రబాబుతో భేటీ అయి తూర్పు తీరంలో తీసుకోవాల్సిన రక్షణపై చర్చించారని తెలుస్తోంది.
ఏపీ తీరప్రాంతం 900 కిలోమీటర్లు పైగా ఉన్న నేపథ్యంలో తీరప్రాంతంలో భద్రతా అంశంపై కీలకంగా చర్చించారని సమాచారం. సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు స్వయంగా ఎల్‌బ్లాక్ ఎనిమిదవ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చి నేవీచీఫ్ ధావన్‌ను సాదరంగా వీడ్కోలు పలికారు.












Click it and Unblock the Notifications