సీఎం చంద్రబాబు ముందు షర్మిల కొత్త డిమాండ్లు..!!
ఏపీలో ఆర్నాబ్ తుఫాను భారీ నష్టం చేసింది. వేల కోట్ల రూపాయాల మేర నష్టం జరిగినట్లు తాజాగా అధికారులు తేల్చారు. సీఎం చంద్రబాబు బాధితులకు ఆర్దిక సాయం ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అటు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు ముహూర్తం సమీపిస్తున్న వేళ ప్రభుత్వం పైన ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శల ధాటి పెంచాయి. తాజాగా పీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్లు ఉంచారు.
ఆర్నాబ్ తుఫాను నష్టం పైన పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు. అందులో.."అన్నదాత కు అర్నబ్ మిగిల్చింది ఆత్మఘోష. ఆరుగాలం పడ్డ కష్టానికి దక్కిన ఫలితం అపారనష్టం. రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండిస్తే, చేతికొచ్చే దశలో తుపాను పాలై, రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతుంటే గుండె తరుక్కు పోతుంది.

అర్నబ్ తుఫాను రైతన్నల ఆశలను మట్టిలో కలిపింది. తుఫాన్ ధాటికి జరిగింది కొండంత నష్టమైతే, ప్రభుత్వం చూపెడుతుంది గోరంత మాత్రమే. జరిగిన నష్టంపై క్షేత్రస్థాయి వాస్తవాలు ఒకటైతే.. ముఖ్యమంత్రి గారు కాగితాల మీద చెప్తున్న లెక్కలు మరొకటి. తుఫాన్ ప్రభావిత జిల్లాలో అన్ని పంటలు కలుపుకుంటే ప్రాథమికంగా జరిగిన నష్టం 15 లక్షల ఎకరాలకు పైనే. ఇందులో వరిపంటను జరిగిన నష్టం అత్యధికంగా 10 లక్షల ఎకరాలు. 100 శాతం పంటలు నష్టపోయిన రైతుల సంఖ్య సుమారు 7 లక్షల పైమాటే..." అని పేర్కొన్నారు.
దీనికి కొనసాగింపుగా.." పంటలు, రోడ్లు, ఇతర మౌలిక రంగాలు అన్ని కలుపుకొని దాదాపు అర్నబ్ మిగిల్చిన నష్టం సుమారు 15 వేల కోట్లు. కానీ ప్రభుత్వం చెప్తున్న నష్ట అంచనా కేవలం రూ. 4600 కోట్లు. ఆర్భాటంలో అగ్రస్థానం.. రైతులను ఆదుకోవడంలో చివరిస్థానం.. ఇదే సీఎం చంద్రబాబు తీరు అని మండిపడ్డారు. ఇదే సమయంలో కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. అందులో.. 1. నీటమునిగిన వరి, ఇతర పంటలకు ఎకరాకి రూ. 30 వేలు రైతుకి చెల్లించాలి. 2. ఉద్యానవన పంటలకు ఎకరాలు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలి.
3. ఆక్వా రైతులకు సైతం కనీసం ఎకరాకు రూ. 50 వేలు పరిహారం అందించాలి. 4. కౌలు రైతులను గుర్తించి వారికి రక్షణగా నిలవాలి. 5. తడిసిన ధాన్యాన్ని MSP ధరకే రైతు కల్లాల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేయాలి. 6. రైతు ఋణాలను మాఫీ చేయాలి. 7. రాబోయే రబీ సీజన్ కి రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి. 8. రైతు మళ్లీ తీసుకునే రుణాలకు వడ్డీ మాఫీ బరోసా ఇవ్వాలి. 9. తీరప్రాంతంలో మత్స్యకారులకు జరిగిన నష్టంపై అంచనా వేసి వారు కోరినట్లు పరిహారం ప్రకటన చేయాలి. 10. రాష్ట్రం దగ్గర నిధులు లేకుంటే పూర్తి నష్టపరిహారాన్ని కేంద్రం నుంచి తెచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేసారు.














Click it and Unblock the Notifications
