చంద్రబాబుకు అందుకు సిద్దం కావాల్సిందే - పేర్ని నాని..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసుల వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని పేర్కొన్నారు. లంచాలు తిని కంచాలు మోగిస్తారా అని దుయ్యబట్టారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు తాజాగా చంద్రబాబు అరెస్ట్ గురించి చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు చేసిందే..కేసీఆర్ కు హరీష్ చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
స్పందన లేదు: టీడీపీ తాజాగా నిర్వహించిన మోత కార్యక్రమానికి స్పందన లేదని పేర్ని నాని పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన చంద్రబాబు.. ముద్రగడ పద్మనాభం నిరసనకు దిగితే ఆయన్ను వేధించారని చెప్పుకొచ్చారు. నిరసన కార్యక్రమాలను కేవలం రాజకీయ కార్యక్రమాలుగా మాత్రమే చేశారన్నారు.

చంద్రబాబు జనం సొమ్ము తిన్నారని ప్రజలు భావిస్తున్నారన్నారు. అందుకే నిరసన కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు. కోటిమంది కేడర్ ఉందని చెప్పుకునే టీడీపీకి మద్దతెక్కడుందని నిలదీసారు. అక్రమ కేసులయితే చంద్రబాబుకు ఎందుకు కోర్టులో అనుకూల తీర్పులు రావడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు.
వెనుకేసారు: అమరావతి స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో భారీగా వెనకేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు జైల్లో ఉంటే లోకేష్ ఢిల్లీ వెళ్లిపోయారన్నారు. టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేసారు. చంద్రబాబుపై కేసులు ఉంటే లోకేష్ ఎందుకు లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు' అని పేర్ని నాని ప్రశ్నించారు.
లోకేష్‌కు దమ్ముంటే చంద్రబాబు అక్రమాస్తుల మీద విచారణకు సిద్ధమవ్వాలన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి విచారణ చేద్దామని సవాల్ చేసారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై ఉన్న కేసులన్నింటిపైనా ఎందుకు స్టే తెచ్చుకున్నారో చెప్పాలన్నారు.
హరీష్ పై ఘాటు వ్యాఖ్యలు: చంద్రబాబు అరెస్ట్‌పై హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పేర్ని నాని.. ఎన్టీఆర్‌కు బాబు చేసిందే కేసీఆర్‌కు హరీష్ చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ అల్లుళ్ల గిల్లుడు సంగతి అందరికీ తెలిసిందే అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అయామకంగా చంద్రబాబును నమ్మి మోసపోయారని...కేసీఆర్ అలా మోసమోయే వ్యక్తి కాదని చెప్పుకొచ్చారు. కోర్టుల్లో చంద్రబాబు నిజాయితీ నిరూపించుకోవాలని అని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు పైన పూర్తి ఆధారాలతోనే విచారణ సాగుతోందని...ఇందులో ఎటువంటి రాజకీయం లేదని పేర్ని నాని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications