ఎందుకు ఓడిపోతున్నామో ఒక్కసారైనా ఆలోచించారా?
భూమి మీద జీవించే ప్రతి వ్యక్తి విజయం కోసం పరుగులు తీస్తుంటాడు. అదే క్రమంలో ఓటమిపాలవుతుంటాడు. ఇంకా ఇంకా విజయం కోసమే పరుగులు తీస్తుంటాడుకానీ ఓటమి నేర్పిన పాఠాలపై దృష్టి పెట్టడు. ఆ పాఠాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగితే చాలు మీరు విజయం సాధించినట్లే. విజయం కోసం 100 సార్లైనా ప్రయత్నిస్తుంటారుకానీ 99 ఓటములు తెలియజేసిన విజయ సూత్రాల గురించి మాత్రం అసలు పట్టించుకోరు. ఈ ఒక్క బలహీనతను అధిగమిస్తే మీరు విజయం సాధించినట్లే.
ఎవరికో అదృష్టం కలిసొచ్చి మొదటి, రెండో ప్రయత్నాల్లోనే విజయం సాధిస్తుంటారు. వారిని చూసి పోలిక తెచ్చుకోకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. పదే పదే ఎందుకు ఓడిపోతున్నాం? పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి? అనేది అర్థం చేసుకోగలిగితే చాలు. ఇప్పటివరకు మీరు వెళ్లే దారిలో కాకుండా కొత్త దారిలో ప్రయత్నించి చూడండి. అందరూ విజయం సాధించడానికి అర్హులే. అది ఎవరికో సొంతమైందికాదు.. అంకితమైంది కాదు. చేసే పనిమీద మనకు నమ్మకం కలిగివుండటంతోపాటు మన ఆత్మవిశ్వాసపు స్థాయిని పెంపొందించుకోవాలి. చేసే పనిలో మనం నిజాయితీగా ఉంటే మననుంచి ఎవరూ విజయాన్ని దూరం చేయలేరు.

మనం పని చేయడం ప్రారంభమవగానే అలా కాదు.. ఇలా కాదు.. మరోలా చేయండి... అంటూ అనేకమంది అనేకసార్లు చెబుతుంటారు. వాటిని కేవలం వినడానికే పరిమితం చేయాలి. అవసరమైన పాయింట్లు ఉంటే గుర్తుపెట్టుకొని మన పనికి అన్వయించుకోవాలి. కానీ చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే.. పని ప్రారంభమైన సమయంలో ఎదుటివారి మాటలపై ఎక్కువ నమ్మకం ఉంచుతారుకానీ తమపై నమ్మకం ఉంచుకోరు. మనిషిని మాట చాలా ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావం నుంచి తప్పించుకోగలిగితే చాలు. మొదటి నుంచి ఆ పనిని మనం ఎలా చేయాలనుకున్నాం.. వాటికి రూపొందించుకున్న ప్రణాళిక మార్గంలోనే పయనించాలి. మాటల ప్రభావంవల్ల మనం ప్రణాళికలు మార్చుకుంటే ఎప్పటికీ విజయం సాధించలేరు.












Click it and Unblock the Notifications