ఫైలిన్ తుఫాను: సాయంత్రం తీరం దాటే అవకాశం
విశాఖపట్నం: ఫైలిన్ తుఫాను శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ రాథోడ్ తెలిపారు. శనివారం ఉదయం మీడియాతో ఆయన ఆ విషయం చెప్పారు. తుఫాను తీరం దాటే సమయంలో సముద్రపు అలలు మూడు నుంచి 3.5 సెం.మీ ఎగిసిపడే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం గోపాలపూర్‌కు 200 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందని, గోపాలపూర్ దగ్గర తుఫాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఒడిషా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని చెప్పారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 210- 240 కి.మీ వేగంతో గాలులు వీచనున్నాయని, రానున్న 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు.

తీరం దాటిన తర్వాత కూడా 6 గంటల పాటు తుఫాను తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఈ తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ క్రమేణ బలహీనపడుతుందన్నారు. తీరం దాటిన తర్వాత 48 గంటల పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ బెంగాల్, యూపీలో వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు.
ప్రస్తుతం గంటకు 15 కి.మీ. వేగంతో తుఫాను పయనిస్తోందన్నారు. పైలిన్ తుఫాన్ పై అమెరికా, ఇతర దేశాలు ఇస్తున్న సమాచారం తప్పు అని వెల్లడించారు. గంజాం, ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్, శ్రీకాకుళంపైనే ఎక్కువగా తుఫాన్ ప్రభావ ం ఉంటుందని రాథోడ్ తెలిపారు.
కాగా, తుఫాను వేగంగా దూసుకుని వస్తోంది. తుఫాను ప్రభావంతో విజయనగరం జిల్లా పుసపాటిరేగ మండలంలోని తీర ప్రాంతంలోని గ్రామాల్లో 4 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. ఫైలిన్ తుఫాను ప్రభావంతో విశాఖ సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఫిషింగ్ హార్బర్‌లో 3 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. 10వ నెంబర్ జెట్టీలో రక్షణ గోడ కూలిపోయింది.












Click it and Unblock the Notifications