చంద్రబాబు అసహనం: హీటెక్కించిన ఎంపీలు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: రాయల తెలంగాణ, కృష్ణా నీటి అంశం మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో హీట్ ఎక్కించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధానిని కలిసేందుకు వచ్చిన తమ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ టిడిపి ఎంపీలు ప్రధాని నివాసం వద్ద ధర్నా చేశారు.
తెలుగుదేశం పార్లమెంటరీ నాయకుడు నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, సిఎం రమేశ్, గుండు సుధారాణి, నిమ్మల కిష్టప్పలు మంగళవారం సాయంత్రం ప్రధాని నివాసానికి వెళ్లారు. వారిని ప్రధాని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
దీంతో వారు గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అ రెస్ట్ చేసి అనంతరం వారిని విడిచిపెట్టారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, దీనిని ప్రధాని దృష్టికి తీసుకువచ్చేందుకు నాలుగు రోజుల క్రితం తమ అధినేత చంద్రబాబు, తాము అపాయింట్‌మెంట్ అడిగామన్నారు.

బాబు 1
తెలుగు వారికి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని టిడిపి ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్థులకు, తనకు అవసరం అనుకున్న వారికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు దృశ్యం.

బాబు 2
రాష్ట్రం నుంచి 30 మంది అధికార పార్టీ ఎంపీలు, 10 మంది కేంద్ర మంత్రులు ఉన్నా.. వారేమీ మాట్లాడటం లేదన్నారు. ఒక ఎంపీగా తాము మాట్లాడేందుకు వెళితే ప్రధాని నివాసం వద్ద గేట్లు మూసేశారని, ఐదు నిమిషాల సమయం ఇవ్వమన్నా ఇవ్వలేదన్నారు.

బాబు 3
ఎంపీలకు వెంటనే సమయం ఇస్తామని గతంలో ప్రధాని హామీ ఇచ్చారని, కానీ దానిని పాటించలేదని టిడిపి నేతలు విమర్శించారు. బాబుకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వనందుకు నిరసనగా ఎంపీలు ప్రధాని అధికార నివాసం 7 రేస్‌కోర్స్ రోడ్డు వద్ద వారు ధర్నా జరిపి ఆందోళన వ్యక్తం చేశారు.

బాబు 4
తెలుగుదేశం నేతలకు ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ లభించలేదు. ఇక చేసేది లేక చంద్రబాబు హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టగా, ఎంపీలు ఆందోళన చేపట్టారు.

బాబు 5
ప్రధాని నివాసానికి చేరుకుని ప్రధాన ద్వారం వద్ద దాదాపు పదిహేను నిమిషాల పాటు ధర్నా చేశారు. ప్రతిపక్షానికి చెందిన ఎంపీలు ప్రధాని నివాసం వద్ద ధర్నా చేయటం ఇదే మొదటిసారి.

బాబు 6
వీరు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో అక్కడ ఉన్న ఎస్‌పిజితో పాటు ఇతర భద్రతా సిబ్బంది ఒక్కసారి విస్మయానికి లోనయ్యారు. అక్కడికి వచ్చిన ఢిల్లీ పోలీసు కమిషనర్ జోక్యం చేసుకుని, ఎంపీలను వెంటనే అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పోలీసులు ఎంపీలను బలవంతంగా వ్యాన్లలోకి ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications