రాజభవన్ ఉగాది వేడుకల్లో ఇద్దరు: ఎవరికి వారే, తెలుగులో కలామ్ (పిక్చర్స్)
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ శుక్రవారం సాయంత్రం రాజభవన్‌లో ఉగాది వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేర్వేరు సమయాల్లో హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ కూడా ఈ ఉగాది వేడుకలకు విచ్చేశారు.
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో శుక్రవారం సాయంత్రం అబ్దుల్ కలామ్ ఉగాది వేడుకలను ప్రారంభించారు. ‘‘ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు'' అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. తెలుగువారితో తనకు ఎంతో కాలంగా ప్రగాఢ అనుబంధం ఉందని.. శ్రీహరికోట ఇస్రోలో పనిచేసినప్పుడు, 1982లో కంచన్‌బాగ్‌లో ఉన్నప్పుడు.. మొత్తం 2500 మంది తెలుగు ఉద్యోగులతో కలిసి పనిచేసిన గొప్ప అనుభూతి తనకుందని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రం ఏపీ, తెలంగాణలుగా విడిపోయిన తర్వాత ఇది తొలి ఉగాది అని.. ఈ సందర్భంగా యావత్ తెలుగు ప్రజానీకం సంతోషంగా ఉండాలని కలాం ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శృంగేరి పీఠం ఆస్థాన విద్వాంసుడు బాచింపల్లి సంతోష్‌కుమార్ శాసి్త్ర ఉగాది పంచాంగం వినిపించారు. విమానం సమయం కావడంతో కలాం ఈ వేడుకలను ప్రారంభించి వెళ్లిపోయారు. ఈ ముగ్గురికీ గవర్నర్ దంపతులు ఆత్మీయంగా శాలువా కప్పి సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ, తెలంగాణ డీజీపీలు జేవీ రాముడు, అనురాగ్‌శర్మ సహా పలువురు ఏపీ, తెలంగాణ అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.

చంద్రబాబు ఇలా..
తెలుగు వారు రెండు రాషా్ట్రల్లో ఉన్నా అందరం కలిసి మెలిసి ఉండాల్సిన అవసరముందని చంద్రబాబు అన్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం మరింత శుభసూచకంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.

స్ఫూర్తి ఇలా..
ఈ సమాజం నుంచి నేనేమి పొందుతాను అనే భావన కన్నా నేనేమి ఇవ్వగలను అనే గొప్ప స్పూర్తి ప్రతి మనిషిలో కలగాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు.

గవర్నర్ ఆకాంక్ష
తెలుగుప్రజలకు ఎంతో విశిష్టమైన రోజు, తొలి పండుగ ఉగాది గవర్నర్ నరసింహన్ అన్నారు. ఈ మన్మథ నామ సంవత్సరాన ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.

తెలుగులో కలామ్
తెలుగువారు ఎక్కడున్నా, మాతృమూర్తి భరతమాతే అని కలామ్ అన్నారు. ‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు' అంటూ తెలుగులోనే తన ప్రసంగాన్ని ముగించారు.

కెసిఆర్ ఇలా...
రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహించి గవర్నర్ ఒక సత్సంప్రదాయాన్ని నెలకొల్పారని కెసిఆర్ అభినందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా...
రాజభవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు. కళాకారులు అతిథులకు వినోదాన్ని అందించారు.

బాలానందం ఇలా..
పిల్లలు తమ సాంస్కృతి కార్యక్రమాల ద్వారా రాజభవన్ వేడుకల్లో అతిథులకు వినోదాన్ని అందిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు.

కెసిఆర్ సంతోషం
ఈ ఏడాది పంచాంగంలో రూపాయి విలువ పెరిగి, దేశం ఆర్థికంగా ఎదుగుతుందని చెప్పారంటూ కెసిఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఆకాంక్ష
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారందరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చి వెళ్లిన తర్వాతే ఏపీ సీఎం చంద్రబాబు రాజ్‌భవన్‌కు రావడం గమనార్హం.












Click it and Unblock the Notifications