ఏపీలో పరిస్థితులపై టీడీపీ ఎంపీతో ప్రధాని కీలక వ్యాఖ్యలు..!!
ఏపీ గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తన కుటుంబ సభ్యులతో ప్రధానిని కలిశారు. ఆ సమయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎంపీ రవీంద్ర ప్రకటన విడుదల చేసారు.
ఎంపీల కుటుంబ సభ్యులు పార్లమెంటు చూడటానికి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిసి ఆయనతో ఫొటో దిగుతుంటారు. అదే తరహాలో రవీంద్ర కూడా ముందుగా సమయం తీసుకొని ప్రధాని చాంబర్‌కు వెళ్లారు. ప్రధానిని కలిసారు. ఆ సమయంలో ఏపీ అంశాల ప్రస్తావనకు వచ్చింది.

ఏపీలో పరిస్థితులపై ప్రధాని ఆరా: టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్ ప్రధానిని కలిసేందుకు వెళ్లిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధానిని కలిసి వెళ్లారు. ఆ తర్వాత రవీంద్ర తన కుటుంబంతో కలిసి ప్రధాని ఛాంబర్ లోకి వెళ్లారు. ఆ సమయంలో జరిగిన సంభాషణలను కొద్ది రోజుల క్రితం ఎంపీ రవీంద్ర కుమార్ ఆపరేషన్ చేయించుకున్నారు.
దీంతో ఆయన ఆరోగ్యం పైన ప్రధాని ఆరా తీసారు. అదే సమయంలో ఏపీకి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయని రవీంద్ర వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని ప్రధాని ఆరా తీయగా..తాను ఏం బాగోలేవని, అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పినట్లుగా రవీంద్ర వివరించారు.
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు: దీనికి స్పందించిన ప్రధాని..తాను అన్నీ తెలుసుకుంటున్నానని వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా బాగా దెబ్బతినిందని... ఏ కార్యకలాపాలూ సాగడం లేదన్నారని.. అభివృద్ధి లేకుండా పోయిందని చెబుతూ.. పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించినట్లుగా ఎంపీ రవీంద్ర వెల్లడించారు.
దీంతో, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కూడా దిగజారిందని తాను చెప్పినట్లుగా రవీంద్ర వివరించారు. దీనికి స్పందనగా పంజాబ్ మాదిరిగా పరిస్థితులు తయారవుతున్నాయంటూ ప్రధాని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఏపీలో ఈ రకమైన పరిస్థితులు దేశాభివృద్ధికి దోహదం చేయదని, రాష్ట్రాన్ని మీరే రక్షించాలని ప్రధానిని రవీంద్ర కోరారు.
ప్రధాని వ్యాఖ్యల వెనుక..వైసీపీ ఆరా: దీనికి స్పందించిన ప్రధాని ఐ విల్ సీ అంటూ సమాధానం ఇచ్చినట్లుగా చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితుల పట్ల ప్రధాని విచారం వ్యక్తం చేసినట్లు కనకమేడల పేర్కొన్నారు. ఇప్పుడు టీడీపీ ఎంపీతో ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలంగా మారాయి.
టీడీపీ ఎంపీ తనతో ప్రధాని చేసిన వ్యాఖ్యలను బయట పెట్టటంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఈ వ్యాఖ్యలపైన చర్చలు మొదలయ్యాయి. ఏపీలో జగన్ ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని..సత్సంబంధాలు కొనసాగుతునే అభిప్రాయం కొనసాగుతున్న వేళ..ఈ కామెంట్స్ కొత్త చర్చకు కారణమవుతున్నాయి. దీని పైన వైసీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications