ఏపీలో ఆ నాలుగు నియోజకవర్గాల పై ప్రధాని మోదీ గురి..!!
ఏపీలో ఎన్నికల పైన ప్రధాని మోదీ ఫోకస్ చేసారు. మూడు పార్టీల కూటమి ప్రచారం, పోలింగ్ సరళి పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల పైన పూర్తి సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. మే నెల 3, 4 తేదీల్లో ఆయన ఏపీ లో పర్యటిస్తారు. షెడ్యూల్ లో భాగంగా ప్రధాని మోదీ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల పైన గురి పెట్టారు. అక్కడే ప్రచారానికి నిర్ణయించారు.
ఏపీలో బీజేపీ లెక్కలు
కూటమి పొత్తుల లెక్కల్లో భాగంగా ఏపీలో బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. దీంతో, బీజేపీ పోటీ చేస్తున్న ఎంపీ స్థానాల్లో పార్టీ గెలుపు అవకాశాల పైన అధినాయకత్వం ఆరా తీసింది. ప్రధాని మోదీ, అమిత్ షా ఏపీలో ప్రచార షెడ్యూల్ ఖరారైంది. కూటమి పొత్తు ఖాయమైన తరువాత ప్రధాని మోదీ మార్చి 17న చిలకలూరిపేటలో జరిగిన సభలో పాల్గొన్నారు. మే 11వ తేదీతో ఏపీలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో..తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం కోసం ప్రధాని మోదీ మే 3,4 తేదీలను ఖరారు చేసారు.

మోదీ ప్రచార సభలు
ప్రధాని ప్రచార సభలు, రోడ్ షోలు బీజేపీ అభ్యర్దులు పోటీ చేస్తున్న ప్రాంతాల్లోనే ఖరారు చేసారు. బీజేపీ ఏపీ నుంచి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉండాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ప్రధాని పర్యటనలో భాగంగా మే 3వతేదీన పీలేరు, విజయవాడ పర్యటిస్తారు. పీలేరులో మధ్యాహ్నం 2.45 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. పీలేరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం. కిరణ్ ప్రస్తుతం రాజంపేట ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. పీలేరు నుంచి కిరణ్ సోదరుడు కిషోర్ పోటీలో ఉన్నారు. అక్కడ మెజార్టీ ఓట్లు దక్కించుకుంటే ఎంపీ స్థానం గెలిచే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా పీలేరులో ప్రధాని పర్యటన ఎంపిక చేసారు.

కూటమి నేతల కసరత్తు
విజయవాడలో సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. అక్కడ రోడ్ షోకు నిర్ణయించారు. 4వ తేదీన రాజమండ్రి ,అనకాపల్లి లోప్రధాని మోదీ పర్యటిస్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో మోదీ పర్యటించి రోడ్ షోలు నిర్వహిస్తారు. రాజమండ్రి నుంచి పురందేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీలో ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తే గెలిచే అవకాశాలు ఉంటాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, నర్సాపురం పరిధిలో ప్రధాని పర్యటన లేకపోవటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మోదీ పర్యటన అనంతరం, కేంద్రం నుంచి మరికొందరు నేతలు ఏపీలో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications