పదేళ్ల తరువాత ముగ్గురూ ఒకే వేదికపై - ప్రధాని కీలక ప్రకటన..!!
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. షెడ్యూల్ ఖరారైంది. ఇక పార్టీలు ప్రచార హోరు పెంచుతున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి మొదటి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. టిడిపి, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు ఖరారైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. పదేళ్ల తరువాత మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదిక మీదకు వస్తున్నారు. ఈ సభలో ప్రధాని ప్రసంగం పై ఆసక్తి నెలకొంది. కీలక ప్రకటన చేస్తారని చెబుతున్నారు.
ఒకే వేదికపై ముగ్గురు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ఎన్డీయే కూటమి మొదటి బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. సాయంత్రం 4.10కి గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న ప్రధాని మోడీ..4.15కి ప్రత్యేక హెలి కాప్టర్ లో బయల్దేరి పల్నాడు బయల్దేరనున్నారు.

సభా ప్రాంగణానికి 4.55కి చేరుకోనున్న మోడీ..అక్కడే సాయంత్రం 6 గంటల వరకు సభలో పాల్గొంటారు. ఆ తరువాత ప్రత్యేక హెలికాఫ్టర్ లో గన్నవరం చేరుకొని హైదరాబాద్ వెళ్తారు. సభా ప్రాంగణంలో ఏడు హెలిపాడ్ లు ఏర్పాటు చేసారు. వీక్షకుల కోసం 24 గ్యాలరీలు సిద్దం అయ్యాయి. సమీప ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ప్రధాని ఏం చెప్పబోతున్నారు
300 ఎకరాల సభాప్రాంగణంలో 225 ఎకరాలు వాహనాల పార్కింగ్, ఏడు హెలిప్యాడ్‌లకు కేటాయించారు. 75 ఎకరాల విస్తీర్ణంలో సభావేదిక, వీఐపీ, ప్రజలకు వేర్వేరుగా బారికేడ్లతో గ్యాలరీలు ఏర్పాటుచేసారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. ఈసభ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్డీఏ కూటమి ఎలాంటి భరోసా ఇస్తారనే ఆసక్తి నెలకొంది.
ప్రధాని మోదీ ప్రసంగంపై ఉత్కంఠత నెలకొంది. 2014లో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మళ్లీ పదేళ్ల తర్వాత ఇప్పుడే ముగ్గురు ఒకే వేదికను పంచుకుంటున్నారు. 2014లో ఈ ముగ్గురు నేతలు ఎన్డీఏ కూటమిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరిగి ఇప్పుడు అదే కూటమి నేతలుగా ఒకే వేదికపైన ప్రసంగం చేయనున్నారు.
హోరా హోరీ రాజకీయం
ఇక, ఈ సభలో ప్రధాని మోదీ ఏపికి సంబంధించి ఎలాంటి హామీలు ఇస్తారనేది ఆసక్తిని పెంచుతోంది. ఎన్డీఏలో చేరిక ఖాయం తరువాత పార్టీ నేతల సమావేశంలోనూ చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి సంబంధించి కొన్ని ప్రకటనలు ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
దీంతో, ఇప్పుడు ప్రధాని ఈ సభ ద్వారా ఏపీకి ఏం చెప్పబోతున్నారు....అదే సమయంలో ఇప్పటి వరకు తమకు సహకరిస్తూ వచ్చిన జగన్ పైన ఏ విధంగా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది. ఈ నెల 19వ తేదీ నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. దీంతో..ఈ సభ ద్వారా ఏపీలో ఎన్నికల రాజకీయంగా మరో స్థాయికి చేరటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications