వెనుక కూర్చున్నా హెల్మెట్ తప్పనిసరి, భారీ జరిమానా - ఈ చలాన్ లు జారీ..!!
బండి నడిపే వారికే కాదు. వెనుక కూర్చొన్న వారికి హెల్మెట్ తప్పనిసరి. లేకుంటే భారీ జరిమానా తప్పదు. నేరుగా వాహనదారులకు ఈ- చలాన్లు వస్తున్నాయి. వీటిని చూసి వారు లబోదిబోమంటు న్నారు. జరిమానా సైతం పెద్ద మొత్తంలో వస్తున్నాయి. వాహనం నడుపుతున్న వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలకు అధికారులు సిద్దమవుతున్నారు.
విశాఖలో ఇకపై ద్విచక్ర వాహన చోదకుడితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాల్సిందే. లేనిపక్షంలో జరిమానాతో పాటుగా ఇతర చర్యలకు సిద్దం కావాల్సిందే. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించే విషయంలో నిబంధనలను విశాఖ ట్రాఫిక్ పోలీసులు కచ్చితం గా అమలు చేస్తున్నారు. వాహనం నడిపేవారే కాదు, వెనుక కూర్చున్నవారు (పిలియన్ రైడర్) హెల్మెట్ పెట్టుకోకపోయినా రూ.1,035 జరిమానా విధిస్తున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 1నుంచి విశాఖ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకపోతే సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి ఈ-చలాన్ జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు మోటార్ సైకిల్ నడిపే వ్యక్తికి హెల్మెట్ లేకపోతే జరిమానా విధిస్తున్నారు. ఇప్పుడు వెనుక వ్యక్తికి హెల్మెట్ లేకపోయినా చలానా వస్తుండటంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.
గత రెండు రోజుల్లో పిలియన్ రైడర్‌కు హెల్మెట్ కారణంతో వేలాది ఈ-చలాన్‌లు జారీఅయినట్టు పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు 31వరకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించామని, జనవరి 1 నుంచి ఈ-చలాన్‌లు జారీ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోని వాహనదారులకు తాజాగా చలాన్లు వస్తుడటం తో షాక్ అవుతున్నారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తే ఇద్దరూ విధిగా ఐఎస్‌ఐ గుర్తింపు కలిగిన హెల్మెట్‌ను ధరించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. నగరంలో ప్రతిరోజూ 40 వేల ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, వాటిపై ప్రత్యేక బృందాలతో రోడ్లపై నిఘా పెడతామని చెప్పారు. బైక్ నడిపిన వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోని పక్షంలో రూ.135 ఈ-చలాన్ జారీచేయడంతోపాటు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకుని రవాణా శాఖ అధికారులకు పంపిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications