తెహెల్క తేజ్‌పాల్: ఫ్రెండ్ కూతురితో లిఫ్ట్‌లో అసభ్యకరంగా
న్యూఢిల్లీ: లైగింక ఆరోపణలతో తెహెల్కా ఎడిటర్ పదవికి రాజీనామా చేసిన తరుణ్ తేజ్‌పాల్‌ను విచారించేందుకు గోవా పోలీసులు శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరి తెలిపారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన తేజ్‌పాల్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తూ అయోమయానికి గురి చేస్తున్నారు. కాగా, సోమా చౌదరిని గోవా పోలీసులు శనివారం ప్రశ్నించారు.
ఈ కేసులో తేజ్‌పాల్‌ను రక్షించేందుకు తనతో పాటు తన కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయలో వత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితురాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ సమీ తవరెస్ నేతృత్వంలోని ఈ బృందంలో ఒక మహిళా పోలీసు అధికారి కూడా ఉన్నారు. ఈ బృందం సంఘటనకు సంబంధించి తేజ్‌పాల్ పంపిన ఇ-మెయిల్స్‌తో పాటు మేనేజిమెంట్‌కు బాధితురాలు పంపిన ఇ-మెయిల్స్‌ను కూడా సేకరించడానికి ప్రయత్నిస్తుందని, ఆ తర్వాత తేజ్‌పాల్‌ను ప్రశ్నించడం జరుగుతుందని ఆ అధికారి చెప్పారు. తేజ్‌పాల్‌ను అరెస్టు చేసే అవకాశం లేకపోలేదన్నారు.

గోవా పోలీసుకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి తమ సంపూర్ణ సహకారాలు అందజేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 15 రోజుల క్రితం గోవాలో జరిగినట్లుగా చెప్తున్న ఈ సంఘటనకు సంబంధించి గోవా పోలీసులు శుక్రవారం తేజ్‌పాల్‌పై అత్యాచారం సహా ఐపిసిలోని ఇతర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
తేజ్‌పాల్ అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని చెప్తున్న హోటల్‌లోని ఎలివేటర్‌లో సిసి టివి కెమెరా లేదని గోవా పోలీసులు తెలియజేశారు. హోటల్ ఎలివేటర్‌లో కెమెరాలు లేవని యాజమాన్యం తమకు తెలియజేసిందని, అయితే ఇతర ప్రాంతాల్లోని సిసి టీవీ కెమెరాలకు సంబంధించి హోటల్ నుంచి అందిన దృశ్యాలను విశ్లేషించడం జరుగుతోందని రాష్ట్ర పోలీసు డిఐజి ఓపి మిశ్రా చెప్పారు. తేజ్‌పాల్‌పై కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పార్రికర్ స్పష్టం చేశారు.
మరోవైపు, ఈ సంఘటనపై బాధితురాలు ఈ సంఘటన గురించి వివరిస్తూ తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరికి ఈ-మెయిల్ ఫిర్యాదును పంపించారు. రెండు వారాల క్రితం గోవాలో తెహల్కా నిర్వహించిన 'థింక్ ఫెస్టివల్' కార్యక్రమమే ఈ దారుణానికి వేదికగా మారింది. తరుణ్ తనను చిన్ననాటి నుండి చూసిన వ్యక్తి అని, తాను ఎంతో గౌరవించే వ్యక్తి అని, తన స్నేహితురాలి తండ్రి అని, తన తండ్రితో కలిసి పని చేసిన వ్యక్తి.. తన పట్ల ఒక్కసారి కాదు.. రెండుసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. లిఫ్టులో రెండుసార్లు అసభ్యకరంగా ప్రవర్తించారని, తప్పని వారిస్తున్నా పట్టించుకోలేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications