''సన్నాసుల్లారా... చెప్పుతో కొడతా... నాలుక చీరేస్తా... మగాడివైతే రారా''..!?
రాజకీయాలు.. జరుగుతున్న పరిణామాలు.. అవి తీసుకుంటున్న మలుపులను పరిశీలిస్తున్నప్పుడు సహజమేలే అనిపిస్తుంది. కానీ ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజకీయ పార్టీలన్నీ నవశకానికి నాంది పలికాయి. ఆ పార్టీ అని లేదు.. ఈ పార్టీ అని లేదు.. అందరూ ఆ తానులోని ముక్కలే అన్నట్లుగా తయారయ్యాయి. భవిష్యత్తు తరాలకు మంచి సందేశం బదులు 'మంచి భాష'ను అందిస్తున్నాయి.

ఆనాటి స్ఫూర్తి ఏది?
ఒకప్పుడు రాజకీయాలు స్ఫూర్తివంతంగా ఉండేవి. నాయకులు చేసే ప్రతి పని వెనక ప్రజల సంక్షేమం ఒక్కటే ఉండేది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ పరస్పరం విమర్శలు చేసుకున్నప్పటికీ ఆ విమర్శల్లో నుంచి వచ్చిన సలహాలను కూడా తీసుకొని అధికార పార్టీ అమలు చేసేది. కాలానుగుణంగా రాజకీయాలు అలాగే ఉన్నప్పటికీ నాయకులు మారారు.. పార్టీల సిద్ధాంతాలు మారాయి. మార్పు సహజం అన్నట్లుగా నాయకుల మాటలు కూడా మారిపోతున్నాయి. ఏపీ రాజకీయాల్లో అయితే సరికొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. భాషాభిమానులు, భాషా పండితులు కూడా ఇంతవరకు వినని, కనని పదాలు వింటున్నారు. పురాణాలకు పురాణాలుగా తిట్లు వెల్లువెత్తుతున్నాయి.

జాతికి ఏ సందేశం ఇస్తున్నారు?
దమ్ముంటే రా, సిగ్గుందా, సన్నాసుల్లారా, చవటల్లారా, ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నావ్, నిన్ను కొడతా, మగాడివైతే రారా, చెప్పుతో కొడతా, సిగ్గుందా, నీ ఇంటికొచ్చి మరీ కొడతా, దద్దమ్మా, నాలుక చీరేస్తా, అంతేకాదు.. ఇంకా రాయడానికి వీలులేని భాషలో ఉపయోగిస్తున్న పదాలు కూడా ఉన్నాయి. అవన్నీ వింటూ ముక్కున వేలేసుకోవడం ప్రజలవంతవుతోంది. రాజకీయమంటే సహజంగానే విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ అవి హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలకు వెళుతున్నాయి. బాధ్యతాయుతమైన నాయకులు రోడ్లమీద ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలం ఉపయోగిస్తే రేపటి పౌరులకు ఈ జాతి ఎటువంటి సమాధానం చెప్పుకోవాలి? ఎటువంటి సందేశం ఇవ్వాలి??.

వెనకబడిపోతామేమో అనే భయంతో..
ఈ విధంగా మాట్లాడుతున్నవారిని ఆయా పార్టీల్లో పైస్థాయిలో ఉన్న నేతలు కట్టుబాటు చేయడంలేదు. ఎంత ఎక్కువ తిడితే అంత మంచిపేరొస్తుందనే ఉద్దేశంలో నాయకులున్నారు. మనల్ని నమ్మి, మనపై బాధ్యత ఉంచి ఓటువేసి గౌరవప్రదమైన సభలకు పంపిస్తే వారి ఓటుకు మనం ఎంత న్యాయం చేస్తున్నాం? ఇలా మాట్లాడటంవల్ల వారంతా ఏమనుకుంటారు? మనల్ని అసహ్యించుకోరా? అనే ఆలోచన మాత్రం మన నాయకులకు కలగకపోవడం దురదృష్టకరం. సవాళ్లు, ప్రతి సవాళ్ల మీద ఉండే శ్రద్ధను నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం మీద పెడితే మంచిపేరు సంపాదించుకోవచ్చని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఒక నాయకుణ్ని చూసి మరో నాయకుడు పుట్టుకొస్తున్నాడు. ఎదుటివారు అసభ్య పదజాలాన్ని ఉపయోగించినప్పుడు మనం సైలెంటుగా ఉండటంవల్ల ప్రజల దృష్టిలో, అధినాయకత్వం దృష్టిలో ఏమీ చేతకానివాడనే ముద్ర పడుతుందనే ఉద్దేశంతో అన్ని పార్టీలు అదే బాటలో పయనిస్తుండటం అత్యంత విచారకరం. రాజకీయాలు ఎప్పటికీ మారవు. అవి అలాగే ఉంటాయి. మారుస్తామని వచ్చినవారు కూడా రాజకీయాలకు అనుగుణంగా మారిపోతుంటారు. అదే అన్నింటికన్నా విచిత్రం.












Click it and Unblock the Notifications