పరకామణి చోరీ ఫిర్యాదుదారుది హత్యే..! తేల్చేసిన టీటీడీ-వైసీపీ డౌట్స్..!
ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో రెండేళ్ల క్రితం జరిగిన చోరీ ఘటనపై ఫిర్యాదు చేసిన అప్పటి అదనపు విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఇవాళ తాడిపత్రి వద్ద రైల్వే పట్టాలపై శవమై తేలడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ దీన్ని హత్యగా తేల్చేశారు. అయితే వైసీపీ మాత్రం పోలీసుల వేధింపులపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
2023లో పరకామణిలో టీడీడీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రవి కుమార్ చోరీకి పాల్పడ్డారు. దీన్ని విజిలెన్స్ అధికారిగా ఉన్న సతీష్ కుమార్ గమనించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రవికుమార్ ఆస్తుల్లో కొన్ని టీటీడీకి రాసిస్తానన్న షరతుతో అప్పటి బోర్డు ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి లోక్ అదాలత్ లో దీనిపై రాజీ చేయించారు. కానీ ఇప్పుడు తిరిగి కూటమి సర్కార్ ఈ వ్యవహారాన్ని తిరగతోడింది. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. దీంతో హైకోర్టు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. అలాగే సీఐడీ అధికారులు ఫిర్యాదుదారు సతీష్ కుమార్ ను విచారణ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో తిరుపతికి విచారణ కోసం వెళ్తున్న సతీష్ కుమార్ తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్ పై శవమై తేలడం కలకలం రేపింది. ఇది హత్యే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ కూడా నిర్ధారించారు. వైసీపీ నేతలే ఆయన్ను హతమార్చారని ఆరోపించారు. ఆయన నోరు తెరిస్తే వాస్తవాలు బయటపడుతాయనే భయంతో హతమార్చారన్నారు. వైసీపీ పాలనలో నేరాలకు పాల్పడిన వారిని, కేసుల్లో కీలకపాత్ర ఉన్న వారిని వరుసగా తొలగించడం కొత్త విషయం కాదని, గతంలో కూడా పరిటాల రవి, వివేక హత్య కేసుల్లోనూ ఇదే తరహా సంఘటనలు జరిగాయన్నారు. ఇప్పుడు పరకామణి కేసులో కూడా అదే పద్ధతి స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఈ దోపిడీపై ఫిర్యాదు చేసిన టిటిడి పాలకమండలి సభ్యులు భానుప్రకాశ్‌ను బెదిరించడం, తర్వాత అనుమానాస్పద స్థితిలో సతీష్ కుమార్ మరణించడం, వైసీపీ నేతల ప్రమేయాన్ని మరింత క్లారిటీగా చూపుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం నిష్పక్షపాత దర్యాప్తు చేస్తుందని నెహ్రూ తెలిపారు. పరామణి దోపిడీ దొంగలను పట్టుకోవడంతో పాటు.. నేడు సతీష్ కుమార్ హత్యకు కారకులకు కఠినమైన శిక్ష విధించాలన్నారు.

అయితే వైసీపీ నేత శైలజానాథ్ సతీష్ కుమార్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సతీష్ అనుమానాస్పద మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలన్నారు. నాడు పరకామణిలో డాలర్ల చోరీ కేసులో నిందితుడైన రవికుమార్‌ను పట్టుకున్న సతీష్ కుమార్, స్వయంగా పోలీసులకు అప్పగించాడని, ఇప్పుడు అదే కేసులో అదే సతీష్‌కుమార్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితుడిగా చేర్చి వేధిస్తోందన్నారు. ఇప్పటికే సతీష్ కుమార్‌ను సిట్ పిల్చి విచారించిందని, నాలుగు రోజుల తర్వాత అతడు తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్‌పై మృతదేహంగా పడి ఉండడం, అనేక అనుమానాలకు తావునిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications