పొరపాటు: కెసిఆర్‌కు పొన్నాల కౌంటర్, ఇబ్రహీం ఝలక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం నిప్పులు చెరిగారు. తెలంగాణ తెచ్చింది కెసిఆర్ ఒక్కరే అనుకుంటే పొరపాటు అన్నారు. తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెసు పార్టీయే అన్నారు. తాము బాధ్యతాయుతమైన పదవులలో ఉండి ఉద్యమంలో ముందున్నామని చెప్పారు.
తెలంగాణ ప్రాంత అభివృద్ధిపై తాను కెసిఆర్‌తో ఏ ప్రాజెక్టు వద్దనైనా చర్చకు సిద్ధమన్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్టును ఇచ్చిందెవరో చెప్పాలన్నారు. పార్లమెంటులో ఎప్పుడైనా తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడావా అని ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో పడుకోవడమే తెలంగాణ ఉద్యమమా అన్నారు. తాను భూమి మీదనే ఉండి మాట్లాడుతున్నానని, బాధ్యతాయుత పదవుల్లో ఉండి ఉద్యమంలో ముందున్నానని చెప్పారు.

సిపిఐతో పొత్తు విషయమై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. సాయంత్రం ఆ పార్టీతో మరోసారి చర్చిస్తామని, చర్చల్లో తనతో పాటు జానా రెడ్డి, దామోదర రాజనర్సింహలు పాల్గొంటారన్నారు. పొత్తులపై తెరాస నుండి ప్రతిపాదన వస్తే తాము పరిశీలిస్తామన్నారు. తాము ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లాలనే పొత్తులు కోరుతున్నామన్నారు.
సిపిఐ 28 అసెంబ్లీ, 3 లోకసభ స్థానాలు అడుగుతుందన్నారు. తాము ఎవరితోను మైండ్ గేమ్ ఆడటం లేదన్నారు. తాము తెరాసతో పొత్తుకు వెంపర్లాడటం లేదన్నారు. గెలిచే వారికే తాము సీట్లు ఇస్తామన్నారు. సామాజిక కోణం, ఉద్యమకారులను పరిగణలోకి తీసుకొని టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. ప్రజాప్రతినిధిగా కెసిఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. పునర్ నిర్మాణానికి, అభివృద్ధికి తేడా తెలియని వారు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
కెసిఆర్‌కు ఇబ్రహీం షాక్
మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత ఇబ్రహీం... కెసిఆర్‌కు షాకిచ్చారు. ఆయన శుక్రవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు. శ్రీనివాస్ గౌడ్‌కు పాలమూరు టిక్కెట్ ఇస్తామని కెసిఆర్ ప్రకటించడంతో ఇబ్రహీం ఆగ్రహంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. తనకు పలు పార్టీల నుండి ఆహ్వానం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications