ప్రేమ ఉంటే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వు: పొన్నం
తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుటుంబంపై ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నందమూరి హీరో బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెసు నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. తిరుపతిలో మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్టీ రామారావు పుట్టి పెరిగిన కృష్ణా జిల్లా బందరు మండలం నిమ్మకూరు గ్రామానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. అంతేగానీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, శంషాబాద్ విమానాశ్రయంలో దేశీ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెసు సభ్యులు మంగళవారంనాడు రాజ్యసభలో ఆందోళనకు దిగారు. కాగ్రెసు సభ్యులు వి. హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తదితరులు రాజ్యసభలో ఆందోళనకు దిగారు.
లోకసభలోనూ ప్రస్తావన
శంషాబాద్ విమానాశ్రయం దేశీ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టడం మంగళవారం జీరో అవర్‌లో లోకసభలో ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రాంతం నాయకుడి పేరును తెలంగాణలోని విమానాశ్రయానికి పెట్టడం సమంజసం కాదని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) సభ్యుడదు వినోద్ కుమార్ అన్నారు. వెంటనే ఎన్టీఆర్ పేరును తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని సమర్థించారు. ఎన్టీఆర్ ఒక ప్రాంతానికి చెందిన నాయకుడు కారని, ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా కూడా పనిచేశారని ఆయన అన్నారు.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీ టెర్మినల్‌కు కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావు పెట్టింది. పౌర విమాన యానాల మంత్రిగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు పి. అశోక్ గజపతి రాజు ఉండడంతో ఆ పేరు పెట్టడం సాధ్యమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం కూడా చేసింది. కాంగ్రెసు తెలంగాణ నేతలు శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications