కోర్టును తప్పుదొవపట్టిస్తున్న జగన్, కోర్టుకు రావాలంటే నామోషి, పీపీ లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు రావడానికి కూడా నామోషీగా ఫీల్ అవుతున్నారని, పాస్ పోర్టు రెన్యువల్ విషయంలో సొంత పూచికత్తు సమర్పించేందుకు ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం ముందు అందుకే ఆయన హాజరు కావడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టులో వాదనలు వినిపించారు.
విజయవాడ కోర్టు ముందు హాజరు కావడానికి నామోషీగా ఫీల్ అయిన వైయస్ జగన్ ఆ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారని పీపీ లక్ష్మీనారాయణ కోర్టులో వాదనలు వినిపించారు. న్యాయస్థానాలు విధించిన షరతులకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని, అది జగన్ కు కూడా వర్తిస్తుందని, మరెవరికైనా వర్తిస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ హైకోర్టుకు చెప్పారు.

తాను న్యాయస్థానాన్ని గౌరవిస్తానని చెబుతున్న జగన్ అదే నాయస్థానం ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టుకు ఎందుకు వెళ్లారని పబ్లిక్ ప్రాజిక్యూటర్ లక్ష్మీనారాయణ ఆయన్ను ప్రశ్నించారు. 2018 నమోదైన పరువు నష్టం కేసు గురించి జగన్ కు ముందే తెలుసు అని, నేరచరిత్ర గురించి ఎన్నికల సంఘానికి 2019, 2024 సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఆ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారని, పరువు నష్టం కేసు విచారణలో పెండింగ్ లో ఉందని జగన్ కేసు నెంబర్ తో సహా వివరాలు వెల్లడించారని పీపీ లక్ష్మీనారాయణ హైకోర్టుకు చెప్పారు.
అయితే ఇప్పుడు మాత్రం ఆ పరువు నష్టం కేసు గురించి తనకు తెలియదని జగన్ చెప్పడం వింతగా ఉందని పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ కోర్టుకు చెప్పారు. ఇంతకాలం విజయవాడ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను మాజీ సీఎం జగన్ తన హోదాను అడ్డుపెట్టుకుని ఆ సమన్లను అందుకోవడం లేదని, గత ఐదున్నర సంవత్సరాలుగా జగన్ కావాలనే పరువు నష్టం కేసు విచారణను సాగదీస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ హైకోర్టుకు తెలిపారు.

జగన్ పై నమోదు అయిన పరువు నష్టం కేసు విచారణ పై హైకోర్టులో స్టే ఉందని జగన్ కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని పీపీ లక్ష్మీనారాయణ ఆరోపించారు. విజయవాడ కోర్టు జగన్ కు మరోసారి తాజాగా సమన్లు జారీ చేసిందని పీపీ గుర్తు చేశారు. జగన్ పాస్ పోర్టు ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేయాలని, ఆయన తమ ముందు వ్యక్తిగతంగా హాజరై రూ. 20వేల స్వీయ బాండ్ పూచికత్తు సమర్పించాలని విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన షరతులు సహేతుకమైనవేనని, ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోరాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ హైకోర్టుకు మనవి చేశారు.
మాజీ సీఎం జగన్ వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకొని ఆయన సమర్పించిన పిటీషన్ కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ హైకోర్టుకు మనవి చేశారు. పాస్ పోర్టు పునరుద్ధరణకు విజయవాడ కోర్టు విధించిన షరతులను సవాలు చేస్తూ మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారం ఇరువైపుల వాదనలు ముగిశాయి ఈనెల 11వ తేదీన ఈ వ్యవహారంపై తీర్పు ప్రకటిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications