నారా లోకేష్‌కు మంత్రి పదవి: చంద్రబాబుకు బాలయ్య ట్విస్ట్
హైదరాబాద్: తన తనయుడు నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నానికి ఎన్టీ రామారావు తనయుడు బాలకృష్ణ పేరుతో తెలుగుదేశం పార్టీ నేత పిఆర్ మోహన్ ట్విస్ట్ ఇచ్చారు.
నారా లోకేష్‌ను ప్రమోట్ చేసే సమయంలో ఎన్టీ రామారావు కుమారుడిని మరిచిపోవద్దని ఆయన సూచించారు. లోకేష్ కోసం తాను ఎమ్మెల్సీ సీటును త్యాగం చేస్తానని బుద్దా వెంకన్న ప్రకటించారు. లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనను టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పిఆర్ మోహన్ కొత్త వాదనను ముందుకు తెచ్చారు. పిఆర్ మోహన్ ఎన్టీ రామారావు అభిమాని. నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇస్తే ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణను మరిచిపోకూడదని ఆయన అన్నారు.

బాలయ్య హిందూపురం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్‌కు మంత్రి పదవి ఇస్తే బాలకృష్ణకు కూడా ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ మేరకు పిఆర్ మోహన్ మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
బాలకృష్ణ కూడా మంత్రి పదవికి అర్హుడేనని ఆయన అన్నారు. నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్‌ను స్వాగతిస్తూనే బాలయ్యకు కూడా ఇవ్వాలని అన్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి పార్టీ సభ్యత్వాన్ని రికార్డు స్థాయిలో 50 లక్షల పైచిలుకును చేయించి గుర్తింపు పొందిన లోకేష్ కేంద్ర పార్టీ ప్రధాన కార్యదర్శి,గా ఎదగడం ఒక రోజులో జరిగిన ప్రక్రియ కాదని అన్నారు.
గత ఆరేడేళ్లుగా పార్టీ అభివృద్ధికి శక్తిమేర పనిచేస్తున్నారని కొనియాడారు. యువతరాన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటే లోకేష్ ముందు వరుసలో ఉంటారని అనడంలో అతిశయోక్తి లేదని, కేంద్ర మంత్రివర్గంలో చేరినా, రాష్ట్ర మంత్రివర్గంలో చేరినా ప్రజలు, కార్యకర్తలు హర్షిస్తారని ఆయన అన్నారు.
అలాగే హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఒక ప్రజా ప్రతినిధిగా నిరంతరం ప్రజా సంక్షేమానికి బేషజాలకు పోకుండా మంత్రుల దగ్గరకెళ్లి నియోజకవర్గానికి నిధులు రాబట్టడానికి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. బాలకృష్ణ కూడా గత కొన్నేళ్లుగా పార్టీకి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న విషయాన్ని మోహన్ గుర్తు చేశారు.
బసవతారకం ట్రస్టు కేన్సర్ హాస్పిటల్ నిర్వహణ బాగా చేస్తున్నారని, బాలకృష్ణ కూడా మంత్రిగా అర్హుడేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications