BRSలో ప్రకాష్ రాజ్ కోసం KCR??
కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని అధికారికం చేస్తూ ఎన్నికల సంఘం పంపించిన కాగితాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ప్రదర్శించారు. కేసీఆర్ తోపాటు ఈ కార్యక్రమంలో కీలకంగా నిలిచింది కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీ కుమారస్వామి, నటుడు ప్రకాష్ రాజ్. కర్ణాటకలో పోటీచేయబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించడమే కాకుండా కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు.

బహుభాషా కోవిదుడిగా ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్ తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారే తరుణంలో జరిగిన మేధోమథనంలో ప్రకాష్ రాజ్ అనేకసార్లు పాల్గొన్నారు. కేసీఆర్ తో ఎంతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకున్నారు. ఒక సమయంలో రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగిందికానీ జరగలేదు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితికి ఢిల్లీలో వాణి వినిపించడానికి బహుభాషా కోవిదుడు అవసరం. తెలుగు, తమిళం, కన్నడం, మరాఠీ, హిందీ, ఇంగ్లిషు భాషలు అనర్గళంగా మాట్లాడే ప్రకాష్ రాజ్ అయితే బాగుంటుందనేది కేసీఆర్ యోచనగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బీఆర్ఎస్ తరఫున దక్కనున్న పదవి?
ప్రస్తుత నివాసం బెంగళూరు కాబట్టి, త్వరలోనే కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి బీఆర్ ఎస్ ప్రతినిధిగా కర్ణాటకలో ప్రకాష్ రాజ్ నియమితులయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ కర్ణాటక కాకపోతే తమిళనాడు, మహారాష్ట్రల్లో కూడా ఏదో ఒక రాష్ట్రానికి ప్రతినిధిగా నియమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ తో కలిసి ప్రకాష్ రాజ్ పలు రాష్ట్రాల్లో పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఏ పదవీ దక్కించుకోలేకపోయిన ప్రకాష్ రాజ్ భారత రాష్ట్ర సమితి తరఫునైనా ఏదో ఒక పదవిని దక్కించుకుంటారనే యోచనలో ఆయన అభిమానులున్నారు.

కర్ణాటకకే మొదటి ప్రాధాన్యం
ప్రస్తుతం కర్ణాటకకే మొదటి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని, త్వరలో జరగబోతున్న ఆ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చేయడమే కేసీఆర్ లక్ష్యంగా ఉంది. అలా చేయాలంటే ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్న జనతాదళ్ ఎస్ పటిష్టంగా ఉండటంతోపాటు భారతీయ జనతాపార్టీకి పడే ఓట్లను చీల్చే ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ బీజేపీని దెబ్బతీయాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న కేసీఆర్ ఎంతవరకు విజయవంతమవుతారో కొద్దిరోజులు గడిస్తేకానీ ఒక స్పష్టత వచ్చేలా లేదు.












Click it and Unblock the Notifications