మంత్రి నారాయణ కోసం రోడ్డుపైనే వెయిట్ చేసిన జగన్ పార్టీ ఎమ్మెల్యే!
విజయవాడ: నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్ది ప్రతాప్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైందన్న వార్తలు ఇప్పటికే మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తను రామిరెడ్డి బుధవారం ఉదయమే కొట్టిపారేశారు.
కాగా, ఇటీవల ఆయన టీడీపీ నేతలతో పలుమార్లు భేటీ అయిన వైనానికి సంబంధించి ఓ తెలుగుపత్రిక తన సంచికలో ఓ ఆసక్తికర కథనం రాసింది. ఈ కథనం ప్రకారం.. తెలుగుదేశంలో చేరేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్న రామిరెడ్డి మే 6న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు.
రామిరెడ్డిని టీడీపీలోకి చేర్చుకునేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇక పూర్తి స్థాయి చర్చలు మంత్రి నారాయణతో జరపాలని రామిరెడ్డికి చంద్రబాబు సూచించారు. అదే సమయంలో రామిరెడ్డితో మాట్లాడి ఆయనను పార్టీలో చేర్చుకునే మిగతా అన్ని విషయాలను పర్యవేక్షించాలని కూడా మంత్రి నారాయణను చంద్రబాబు ఆదేశించారు.

ఈ క్రమంలో మే 8న రాత్రి నెల్లూరు నుంచి మంత్రి నారాయణ విజయవాడకు బయలుదేరారు. నారాయణ నుంచి సమాచారం అందుకున్న రామిరెడ్డి కావాలిలో తన ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డితో కలిసి రోడ్డుపై వేచి చేశారు.
తన కాన్వాయ్‌ని రామిరెడ్డి వద్ద ఆపేసిన మంత్రి నారాయణ తన కారు దిగి రామిరెడ్డి కారు ఎక్కారు. అక్కడి నుంచి వారిద్దరూ ఓ రహస్య ప్రదేశానికి వెళ్లి దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించిన నేపథ్యంలోనే రామిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ కథనం ఇలా ఉన్నా.. తాను టిడిపిలో చేరేది లేదని, వైసీపీని వదిలేదని ప్రతాప్ అంటున్నారు. మరికొన్ని రోజులు వేచి చూస్తే గానీ అసలు విషయం తెలిసే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications