గుడ్ న్యూస్: తెలంగాణ నుంచి ఏపీకి షిఫ్ట్
తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్న భారీ సోలార్ ఫొటోవోల్టాయిక్ సెల్ తయారీ ప్లాంట్ ఏపీకి రానుంది. ఈ మేరకు ప్రీమియర్ ఎనర్జీస్ నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా కసరత్తు కూడా మొదలు పెట్టింది. మొత్తం 1,700 కోట్ల రూపాయల మేర భారీ పెట్టుబడికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవి. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో ఈ ప్లాంట్ ను నెలకొల్పాలని సంస్థ యాజమాన్యి నిర్ణయించింది.
ఈ పెట్టుబడితో నాలుగు గిగా వాట్ సామర్థ్యం గల సోలార్ పీవీ టాప్ కాన్ సెల్ తయారీ యూనిట్, దానికి అనుబంధంగా అయిదు గిగా వాట్ సిలికాన్ ఇంగట్, వేఫర్ తయారీ ప్లాంట్‌ను కూడా నెలకొల్పనుంది. ఈ విషయంలో తెలంగాణ కంటే కూడా ఏపీ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించడం వల్లే ఇది సాధ్యపడింది. ఈ ప్రాజెక్టు తరలింపు వెనుక ఏపీ ప్రభుత్వం చూపిన చొరవ, వేగం అద్భుతమని కంపెనీ యాజమాన్యం ప్రశంసించింది.

కంపెనీకి అవసరమైన 269 ఎకరాల భూమిని ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ద్వారా అతి తక్కువ సమయంలో కేటాయించింది ప్రభుత్వం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్స్ అని మాటలకు పరిమితం కాకుండా అక్టోబర్ 2024లో చర్చలు మొదలెట్టి, ఫిబ్రవరి 2025 కల్లా భూమి కేటాయింపు జరిపింది. పారిశ్రామికరంగంలో పెట్టుబడులు పెట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైంది. తన సామర్థ్యాన్ని చేతల్లో చూపించింది.
పోర్టులకు దగ్గరగా ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలు ప్రీమియర్ ఎనర్జీస్ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా సుమారు 2,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పరిశ్రమ విస్తరణతో మరిన్ని ఉద్యోగాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఏపీ.. సోలార్ తయారీ రంగానికి కేంద్రబిందువుగా మారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇది రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుంది.
తొలి పెట్టుబడి రూ. 1,700 కోట్లతో పాటు, భవిష్యత్తులో ఈ సెల్ తయారీ సామర్థ్యాన్ని ఏడు గిగా వాట్స్ కు పెంచడానికి మరో రూ. 502 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్. తయారీ ప్రక్రియలో సమన్వయం (Backward Integration) కోసం సిలికాన్ ఇంగట్/వేఫర్ తయారీని, సెల్ తయారీని ఒకే చోట నెలకొల్పడం కంపెనీ వ్యూహం.
ఏపీలోని సౌర శక్తికి అనుకూల వాతావరణం, ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు ఈ పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు రాకతో ఆంధ్రప్రదేశ్ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో లక్ష్యంగా పెట్టుకున్న పెట్టుబడులు, ఉద్యోగాల సాధన దిశగా మరో ముందడుగు వేసినట్లయింది.












Click it and Unblock the Notifications