బంగాళాఖాతంలో డబుల్ అల్పపీడనాలు: ఏపీకి అతి భారీ వర్షాలు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో భారీగా వర్షాలు కురుస్తోన్నాయి. పలు జిల్లాల్లో దంచికొడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడుతున్నాయి. ప్రత్యేకించి- కోస్తాజిల్లాలపై దీని తీవ్రత అధికంగా ఉంటోంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
పశ్చిమమధ్య- దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఫలితంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

ఇప్పుడున్న అల్పపీడనానికి తోడు మరొకటి జత కానుంది. సోమవారం నాటికి వాయవ్య బంగాళాఖాతం- దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావం ఏపీ, ఒడిశాపై అధికంగా ఉంటుందని తెలిపింది.
దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీవర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ జంట అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు.
నేడు- అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతుందని చెప్పారు. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి.












Click it and Unblock the Notifications