హిందూపురంపై మారుతున్న బాలయ్య ఆలోచన
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దిగాయి. ఈనెల 18 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. మే 13న ఎన్నికలు జరగనుండగా జూన్ నాలుగోతేదీన ఫలితాలు విడుదల కాబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను దాదాపుగా అందరినీ ప్రకటించేసింది. మొదటి జాబితాలోనే హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ పేరు ఉంది. అయితే నెలరోజులవుతున్నప్పటికీ బాలయ్య మాత్రం ఇంతవరకు హిందూపురంలో అడుగుపెట్టలేదు.
ఇక్కడ హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బాలయ్య ఉన్నారు. ఆయన తరఫున ద్వితీయ శ్రేణి నేతలే ప్రచారం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇప్పటికే ఒక విడత తమ ప్రచారాన్ని ముగించేసి రెండో విడత ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారు. హిందూపురంలో బాలయ్యను ఓడించేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మహిళా అభ్యర్థి దీపికను రంగంలోకి దింపారు. దీపికతోపాటు ఆమె భర్త వేణురెడ్డి కూడా వేర్వేరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

హిందూపురంలో ఓ సభ ఏర్పాటు చేసి నారా లోకేష్ పార్టీ శ్రేణులను సిద్ధం చేసి వెళ్లారు. ఆ కార్యక్రమంలో కూడా బాలయ్య పాల్గొనకపోవడం విచిత్రంగా అనిపించింది. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాలయ్యను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూపురం పట్టణంతోపాటు చిలమత్తూరు మండలాల్లో టీడీపీ నేతలను వైసీపీలోకి ఆకర్షించుకుంటున్నారు. అందుకు అన్నిరకాలుగా ఆఫర్లను అందజేస్తున్నట్లు తెలుస్తోంది. హిందూపురం వైసీపీలో నాలుగు వర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఓటమిపాలైన మహ్మద్ ఇక్బాల్ త్వరలోనే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు బాలయ్య నియోజకవర్గంలోకి అడుగుపెట్టకపోతే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ముహూర్తాలను, జాతకాలను బలంగా విశ్వసించే బాలకృష్ణ అందుకనుగుణంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. గ్రహాల ప్రభావం, మూహార్తాలను చూసుకొని హిందూపురంలోకి అడుగుపెడతారంటున్నారు. బాలయ్య ఏం చేస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications