మంగళగిరిలో 'సీన్' అర్థమవుతోంది!
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం విస్త్రతంగా కలియతిరుగుతున్నారు. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలైనప్పటికీ ఈసారి ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా విజయం సాధించాలనే ధీమాతో అక్కడినుంచే బరిలోకి దిగారు. ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి రాకముందు వరకు రాష్ట్రవ్యాప్తంగా మెరుపు పర్యటనలు చేపట్టారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మంగళగిరికే పరిమితమయ్యారు.
గడప గడపకు తిరుగుతూ లోకేష్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయాడు.. ఈసారి కచ్చితంగా గెలవాలి అనే సెంటిమెంట్ లోకేష్ కు కలిసొచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన వైసీపీ మీద నానా రకాల విమర్శలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిట్టిన నోటితోనే వైసీపీని పొగుడుతూ మళ్లీ పార్టీలో చేరారు. ఇలా చేయడంవల్ల నియోజకవర్గంలో ఆయన విలువ తగ్గిపోయిందని భావిస్తున్నారు.

అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తర్జన భర్జనలు పడింది. చివరకు మురుగుడు లావణ్యను ప్రకటించింది. ప్రస్తుతం ఆమె ప్రచారంలో వెనకబడివున్నారని, కేవలం టీడీపీమీద రాజకీయ విమర్శలతోనే సరిపెడుతున్నారని, ప్రజల్లోకి చొరవగా చొచ్చుకుపోవడంలేదంటున్నారు. మరోవైపు నారా లోకేష్ నియోజకవర్గంలో గల్లీ గల్లీకి, ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇదంతా గెలవడం కోసం కాదని, రికార్డు మెజారిటీ సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు సర్వే సంస్థలు కూడా మంగళగిరి నియోజకవర్గంలోని పరిస్థితి ఏమిటి? అనే విషయమై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాయి. నామినేషన్లకు గడువు కూడా ముగియడంతోపాటు సర్వే ఫలితాలను ప్రకటించే వీలు లేకపోవడంవల్ల అక్కడి పరిస్థిని సంస్థలు బయటకు చెప్పలేకపోతున్నాయి.












Click it and Unblock the Notifications