రామ్మోహన్ నాయుడుకు అరుదైన అవకాశం కల్పించిన మోడీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే నీతి ఆయోగ్ కు ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు నియమితులయ్యారు. కేంద్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా నీతిఆయోగ్ సభ్యులను మారుస్తుంటారు. తాజాగా కొత్త మంత్రివర్గం ఏర్పాటడంతో కూర్పును కేంద్ర ప్రభుత్వం సవరించింది. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పేరును కూడా చేర్చారు.
ఇతర మంత్రలు కూడా
ఈ జాబితాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి జేడీ కుమారస్వామి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి, ఆహార శుద్ధి శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఎంఎస్ఎంఈ మంత్రి జీతన్‌రాం మాంఝీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి జూయెల్ ఓరం కూడా ఉన్నారు.

36 ఏళ్లకే మంత్రిగా
కేంద్ర కేబినెట్ లోని మంత్రులతోపాటు ఎంపీలో అత్యంత పిన్నవయసు కలిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు(36). శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వరుసగా 2014, 2019, 2024 ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. 2012లో తన తండ్రి ఎర్రన్నాయుడు రోడ్డుప్రమాదంలో మరణించడంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రామ్మోహన్ నాయుడు తెలుగు, హిందీ, ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడతారు.
మే 13న జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై 3.2 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా అత్యంత పిన్న వయసులోనే 39 ఏళ్ల వయసులోనే 1996లో మంత్రి అయ్యారు. దేవెగౌడ మంత్రివర్గంలో పనిచేయడంతోపాటు పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా కూడా వ్యవహరించారు. ఎర్రన్నాయుడి వారసత్వాన్ని రామ్మోహన్ నాయుడు కొనసాగిస్తూ సమర్థవంతమైన నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications