ఎప్పటికైనా దొరక్కపోతావా?: విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు..
ఒంటరిగా ఉన్న సమయంలో తమ వద్దకు వచ్చి..'ఎప్పటికైనా దొరక్కపోతావా' అంటూ తమను వేధిస్తున్నాడని విద్యార్థినులు ఎమ్మెల్యేతో చెప్పారు.
విశాఖపట్నం: విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపాల్ వక్రమార్గం పట్టాడు. విద్యార్థులకు మంచి చెప్పాల్సింది పోయి తన బుద్దిహీనతను బయటపెట్టుకున్నాడు. గిరిజన విద్యార్థినులను చిన్నచూపు చూస్తూ వారిని లైంగికంగా వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. చివరికి విషయం కాస్త ఎమ్మెల్యే దాకా వెళ్లడంతో.. సదరు ప్రిన్సిపాల్ పై అధికారులు చర్యలకు సిద్దమవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లాలోని గూడెం కొత్తవీధిలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అక్కడి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై కాలేజీ విద్యార్థినులు, కాంట్రాక్ట్ మహిళా లెక్చరర్స్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మంగళవారం నాడు గూడెం కొత్తవీధిలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కాలేజీని సందర్శించారు. ఫిర్యాదుపై విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బాలికలు తమకు ఎదురవుతున్న వేధింపుల గురించి ఆవేదన చెందుతూ ఎమ్మెల్యే వద్ద వాపోయారు.
ఒంటరిగా ఉన్న సమయంలో తమ వద్దకు వచ్చి..'ఎప్పటికైనా దొరక్కపోతావా' అంటూ తమను వేధిస్తున్నాడని విద్యార్థినులు ఎమ్మెల్యేతో చెప్పారు. 'స్నానాల గదులను మరమ్మత్తు చేయిస్తా.. మీరు ఇబ్బంది పడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా.. నాతో హైదరాబాద్ వస్తారా!, నిర్ణయం మీదే ఇక, ఎదురుచూస్తుంటా..' అంటూ తమను పదే పదే లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన చెందారు.
అస్వస్థతకు గురైన సందర్బంలోను వైద్యుడిని సంప్రదించకుండానే.. బయటి మార్కెట్లో దొరికే మందులు, ఇంజెక్షన్స్ తీసుకొచ్చి ఇస్తున్నారని విద్యార్థినులు చెప్పారు. స్థానిక ఏఎన్‌ఎంతో సంప్రదించకుండా బయట ఉండే ఆర్‌ఎంపీ వైద్యులతో చికిత్స చేయిస్తున్నారని అన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో మందులు అందుబాటులోనే ఉన్నా.. బయట మందులనే కొనుగోలు చేయాలని తమపై ఒత్తిడి చేస్తున్నట్లు సిబ్బంధి తెలిపారు. ప్రిన్సిపాల్ నిర్వాకం గురించి విద్యార్థినులను, మహిళా అధ్యాపకులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. ప్రిన్సిపాల్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి ప్రిన్సిపాల్ ను కొనసాగించాలా? వద్దా? అని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. వద్దు అని విద్యార్థినులంతా నినాదాలు చేశారు. విషయాన్ని లెక్టరు ప్రవీణ్‌కుమార్, గురుకులం కార్యదర్శి, ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమ శాఖ డీడీ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే.. ప్రిన్సిపాల్ పై వారికి ఫిర్యాదు చేశారు.
బాధితులతో కలిసి ఆయా శాఖాధికారులకు బుధవారం నాడు లిఖితపూర్వక ఫిర్యాదులు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రిన్సిపాల్ ను గనుక తొలగించకుంటే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని అన్నారు.












Click it and Unblock the Notifications