సీనియర్ నేతను అభ్యర్ధిగా ప్రకటించిన చంద్రబాబు - గో బ్యాక్ నినాదాలు..!!
పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్దిని చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయం పైన పార్టీ నేతలు అధ్యక్షుడి సమక్షంలోనే నినాదాలు చేసారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన తాజాగా పార్టీ సీనియర్ నేత..మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్పను పెద్దాపురం పార్టీ అభ్యర్దిగా ప్రకటించారు. మూడో సారి చినరాజప్పను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనిని నియోజకవర్గంలో పార్టీ నేతలు వ్యతిరేకించారు. పెద్దాపురం సీటు ఆశిస్తున్న నేతల మద్దతు దారులు వ్యతిరేక నినాదాలు చేసారు. దీంతో...వారిని చంద్రబాబు నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు. టికెట్ రేసులో ఉన్న నేతలతో పార్టీ ముఖ్యులు మంతనాలు ప్రారంభించారు. వారికి కీలక నేతలు బుజ్జగింపులు ప్రారంభించారు.
వచ్చే ఎన్నికలకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరమైన వారి నియోజకవర్గాల్లో మాత్రం ప్రత్యామ్నాయం పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో తూర్పు గోదావరిలో పర్యటన సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మకాయల చిన రాజప్ప కు తిరిగి పెద్దాపురం సీటు కేటాయించారు. ఈ విషయాన్ని నియోజకవర్గంలో రోడ్ షో లో ప్రకటించారు. జనసేనతో పొత్తు ఖాయమని భావిస్తున్న సమయంలో రెండు పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. చంద్రబాబు నిర్ణయం ప్రకటించిన గంటల్లోనే నియోకవర్గంలో నిరసన మొదలైంది.

చంద్రబాబు సమక్షంలోనే అభ్యర్దిగా ఖరారైన చినరాజప్పకు నిరసన సెగ తప్పలేదు. టీడీపీ కార్యకర్తలు చిన రాజప్ప గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. చంద్రబాబు వారిని వారించారు. మీ ఎమ్మెల్యే.. మీ నాయకుడిని అగౌరవపరచటం మంచిది కాదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రాజప్పను ముచ్చటగా మూడోసారి గెలిపించాలని చంద్రబాబు మరోసారి కోరారు. ఆ సమయంలో కార్యకర్తలు తమ నినాదాలు మరింతగా పెంచారు. పెద్దాపురం సీటు ఆశిస్తున్న నేతలు అలక బూనారు. నియోజకవర్గ నేతలు చంద్రమౌళి, బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి టికెట్ ఆశిస్తున్నారు. వారికి అధిష్ఠానం బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. వారికి పార్టీ అధినేత నుంచి పిలుపు వచ్చింది. వారు భేటీకి నిరాకరించటంతో.. ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ సీనియర్లు..ఆ ఇద్దరినీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications