డీలిమిటేషన్ వేళ.. ఎస్సీ రిజర్వుడ్ గా పులివెందుల?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై వాడివేడిగా చర్చ సాగుతోంది. డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ సమక్షానికి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందనే వాదనలు, అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమౌతోన్నాయి. తమిళనాడు వంటి రాష్ట్రాలు దీన్ని బాహాటంగా వ్యతిరేకిస్తోన్నాయి. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ గళాన్ని వినిపిస్తోన్నాయి. కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిని తప్పుపడుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం సైతం తెరమీదికి వస్తోంది. ఈ ఏడాది సంభవించే అవకాశం ఉన్నట్లుగా భావిస్తోన్న అసెంబ్లీ స్థానాల పునర్విభజన వల్ల ఏపీ ముఖచిత్రం సమూలంగా మారొచ్చు. ఈ ప్రక్రియ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగులుతుందనే అంచనాలు ఉన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు.

ఈ పునర్విభజనలో వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పులివెందుల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్‌గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. కేంద్రం చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం కూడా జనాభా లెక్కల ఆధారంగా జరుగుతందనేది తెలిసిందే. దీని ఆధారంగా అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు సరిహద్దులను నిర్ణయిస్తారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను రొటేషన్ పద్ధతిలో మార్చడం కూడా ఇందులో భాగమే.
దీనివల్ల ఏ నియోజకవర్గం కూడా శాశ్వతంగా రిజర్వ్డ్‌గా ఉండదు. ఏ ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే ప్రాతినిథ్యాన్ని వహించదు. రాష్ట్రపతి నియమించే డీలిమిటేషన్ కమిషన్, ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాలు చేయడానికి వీలుండదు. ఈ వ్యవహారం మొత్తం కూడా వైఎస్సార్‌సీపీపై గణనీయమైన ప్రభావం చూపుతుందని సమాచారం.
పులివెందుల స్థానం ఎస్సీ రిజర్వుడ్ గా మారితే జగన్ పొరుగునే ఉన్న జమ్మలమడుగు నుంచి పోటీచేస్తారనే వాదన ఉంది. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ మద్దతుతో ఎన్డీఏ అధికారంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో- పులివెందులను ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ, కమిషన్‌ను ప్రభావితం చేయవచ్చని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళనలు వ్యక్తం చేస్తోన్నారు. పులివెందుల నియోజకవర్గం పరిధిలో 90,000 వరకు ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications