Pushpa-2: గంగమ్మ జాతర గూస్ బంప్సే..చరిత్ర తెలుసుకుందాం..!!
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షోతో ప్రారంభమైన ఈ సినిమా... ఇక నాన్‌స్టాప్ కలెక్షన్స్‌తో నడుస్తోంది. అల్లు అర్జున్ పండించిన నటనకు మరోసారి ఆయన్ను జాతీయ అవార్డు వరించే అవకాశం ఉందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక పుష్ప -2 సినిమాలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నది గంగమ్మ జాతర గురించి. ఎందుకంటే అల్లు అర్జున్ ఈ జాతర సన్నివేశాల్లో నటించిన తీరు ప్రేక్షకుడికి గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇంతకీ ఈ గంగమ్మ జాతర ఏంటి.. నిజంగానే జరుగుతుందా.. ఈ జాతర కథేంటో తెలసుకుందాం.
గంగమ్మ జాతర చరిత్ర
పుష్ప-2 సినిమాలో గంగమ్మ జాతర సన్నివేశాలు మొత్తం చిత్రానికే హైలైట్ అని సినిమా చూసిన వారు చెప్తున్నారు. సినిమాలో చిత్రీకరించిన గంగమ్మ జాతర నిజంగానే తిరుపతిలో ప్రతి సంవత్సరం మే నెలలో జరుగుతుంది. ఈ జాతర రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది. ఈ జాతర జరగడం వెనుక పెద్ద కథే ఉంది. తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుపతి గ్రామదేవత. తిరుపతిని ఒకప్పుడు పాలెగాడు పాలన చేస్తుండేవాడు. ఆ సమయంలో మహిళలపై వీరు చేయని అఘాయిత్యం అంటూ లేదు. అమ్మాయి నచ్చిందంటే చాలు అతని వశమైపోవాల్సిందే. వయస్సుతో సంబంధం లేకుండా కన్ను మిన్ను కానరాకుండా ఈ పాలెగాడు మహిళలపై విరుచుకుపడేవాడు. అత్యాచారం చేసేవాడు. ఈ అరాచకాలు హద్దుమీరుతున్న వేళ ఆవిలాల గ్రామంలో గంగమ్మ తల్లి జన్మించారు. ఆమె యుక్తవయసులో చాలా అందంగా ఉండేవారట.

గంగమ్మ పై పాలెగాడి కన్ను
గంగమ్మ తల్లిపై పాలెగాడి కన్నుపడింది.పాలెగాడు గంగమ్మకు హాని తలపెట్టాలని భావించిన వేళ ఆమెకున్న శక్తులతో అతడిని అంతమొందించేందుకు ప్రయత్నం చేసింది. గంగమ్మకు భయపడ్డ పాలెగాడు ఎవ్వరికీ కనిపించకుండా దాక్కున్నాడు. గంగమ్మ తల్లి ఎలాగైనా వారిని పట్టుకుని సంహరించి మహిళలకు విముక్తి కల్పించాలని భావిస్తుంది. ఇలా అతన్ని బయటకు రప్పించేందుకు పలు వేషాలు ధరించింది. కానీ పాలెగాడు దాక్కున్న చోట నుంచి బయటకు రాలేదు. అయితే ఇలా నాలుగు రోజుల పాటు నాలుగు వేషాల్లో దర్శనమించ్చింది గంగమ్మ.
ఇందులో తొలిరోజు బైరాగి వేషం, రెండవ రోజు బండ వేషం, మూడవ రోజు తోటి వేషం వేసిందట.అయినప్పటికీ బయటకు రాకపోవడంతో నాల్గవ రోజున దొరవేషం వేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక దొర వేషం వేయగానే పాలెగాడు తన ప్రభువు వచ్చాడని తెలుసుకుని దాక్కున్న చోట నుంచి బయటకు వచ్చాడు. ఆలస్యం చేయకుండా గంగమ్మ తల్లి పాలెగాడిని చంపి తిరుపతి మహిళలకు ఇతగాడి నుంచి విముక్తి కల్పించిందని చెబుతారు. దీన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా తిరుపతితో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు గంగమ్మ జాతర నిర్వహిస్తారట.

చాటింపుతో ప్రారంభమయ్యే జాతర
గంగమ్మ జాతర నిర్వహించాలని భావించినప్పుడు ముందుగా మంగళవారం అర్థరాత్రి చాటింపు వేయిస్తారు.ఈ జాతరను నిర్వహించే బాధ్యత తీల్లయ మిరాసి ఆచారి కుటుంబానికి చెందిన ఈపూరు ఆచారి, కాశీ ఆచారిలు తీసుకుంటారు. జాతరకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. తాతయ్య గుంట తీరంలో గంగమ్మ తల్లి ఆలయం ఉండటంతో దీన్ని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంగా పిలుస్తారు.
ఇక చాటింపుతో ప్రారంభమైయ్యే గంగమ్మ తల్లి జాతరలో తొలిరోజున భైరాగి వేషం వేస్తారు. ఈ వేషం వేసేవారు తెల్ల రంగులతో శరీరాన్ని నింపేస్తారు.రేగిపండ్లతో తయారు చేసిన మాలను ధరిస్తారు.వేపాకులు చేత్తో పట్టుకుని, నడుం చుట్టూ కట్టుకుంటారు.ఇలా వేషధారణలో తిరుపతిలో నడుచుకుంటూ తాతయ్యగుంట వద్ద ఉన్న గంగమ్మ తల్లిని దర్శించుకుని అక్కడే మాలను తీసి, వేపాకులను వదులుతారు. ఇక రెండవరోజు బండ వేషం వేస్తారు. తలకు ఒక రిబ్బను కట్టి, శరీరమంతా కుంకుమతో నింపేస్తారు. మూడవ రోజున తోటి వేషం వేస్తారు.శరీరమంతా బొగ్గుపూసి వేపాకు మాల ధరిస్తారు. నాల్గవ రోజు దొరవేషం వేస్తారు. చందనంతో తమ శరీరాన్ని నింపేస్తారు.వేపాకు నిమ్మకాయలతో చేసిన మాలను ధరిస్తారు.
ఐదవ రోజు మాతంగి వేషం వేస్తారు.పాలెగాడిని దొరవేషంలో వధించిన గంగమ్మ, అతని భార్యను ఓదార్చే సమయంలో మాతంగి వేషం ధరించిందని భక్తులు చెప్తున్నారు. ఆరవ రోజున ఒక తెల్లటి ముద్దతో అభిషేకించుకుని, బొగ్గుతో శరీరంపై చుక్కలు వేసుకుంటారు.అనంతరం వారి తలపై ఒక కుండను మోసుకెళ్తారు. గంగమ్మ తల్లి ఆలయంకు చేరాక మూడుసార్లు ప్రదక్షిణ చేసి కుండను అక్కడ వదిలేసి గంగమ్మను దర్శించుకుంటారు.ఏడవ రోజు అంటే జాతర చివరి రోజున గంగ జాతర పండుగలా నిర్వహిస్తారు.ఈ రోజున తిరుపతి నగరంలోని గంగమ్మ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి.గంగమ్మకు పొంగళి నైవేద్యంగా పెడతారు. సారె ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఇక అర్థరాత్రి దాటిన తర్వాత మట్టితో తయారు చేసిన గంగమ్మ బొమ్మను ఆలయం ముందు ఉంచుతారు. పేరంటాళ్లు వేషం వేసిన ఓ వ్యక్తి గంగమ్మ విశ్వరూపంలో ఉన్నప్పుడు చెంపను తొలగిస్తాడు. దీన్నే చెంప తొలగింపు అని పిలుస్తారు. తర్వాత ఆ మట్టిని అక్కడికి చేరివచ్చిన భక్తులకు పంచుతారు. ఈ మట్టి పలు జబ్బులను నయం చేసే శక్తి ఉంటుందని బలంగా విశ్వసిస్తారు. ఈ చెంప తొలగింపు కార్యక్రమంతో ఏడు రోజుల జాతర ముగుస్తుంది.












Click it and Unblock the Notifications