'పుష్ప' స్టైల్ స్మగ్లింగ్: ఆంధ్రా స్మగ్లర్ల 'బ్రాండ్ ఐడియా'!
Sandalwood Smuggling: స్మగ్లర్ల తెలివికి హద్దే లేదు. ముఖ్యంగా సువాసన అధికంగా ఉండే గంధపుచెక్కలను రవాణా చేయడంలో పట్టుబడకుండా ఉండేందుకు వీరు ఎంచుకున్న పంథా చూస్తే.. నిజంగానే క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'పుష్ప' సీన్‌లా అనిపించక మానదు. గంధపు చెక్కల నుంచి వచ్చే ఘాటైన వాసనను కప్పిపుచ్చడానికి.. మరీ ఘాటైన ఉల్లిపాయల బస్తాల కింద వాటిని దాచి స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను బెంగళూరు సిద్ధపుర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
అందిన పక్కా సమాచారం ఆధారంగా సిద్ధపుర పోలీసులు దక్షిణ బెంగళూరులోన ఓ హోటల్ వద్ద పార్క్ చేసి ఉన్న రెండు అనుమానాస్పద వాహనాలను వలపన్ని తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో ఆ వాహనాల్లోని దృశ్యాన్ని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ వాహనాలలో దాదాపు ఏడున్నర క్వింటాల బరువున్న 250 గంధపు చెక్కలు పోలీసులకు దొరికాయి. వాటి విలువ దాదాపు రూ.1.12 కోట్లు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు.

వాసన తెలియకుండా ఉల్లిపాయల కవరింగ్!
పోలీసులు తనిఖీ చేసినప్పుడు వాహనంలో పైనంతా కేవలం ఉల్లిపాయల బస్తాలు మాత్రమే కనిపించాయి. కానీ ఆ బస్తాల కింద గట్టిగా ప్యాక్ చేసి, జాగ్రత్తగా దాచిన గంధపుచెక్కలు బయటపడ్డాయి. "గంధపుచెక్కల నుంచి వచ్చే సుగంధం సులభంగా ఇతరులకు తెలిసిపోతుంది. అందుకే దాన్ని కప్పిపుచ్చడానికి ఉల్లిపాయల ఘాటు వాసనను వీరు 'కవర్'గా ఉపయోగించారు. ఇది వాసన ఆధారిత దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి స్మగ్లర్లు వాడిన కొత్త టెక్నిక్" అని సిద్దపుర పోలీస్ అధికారి ఒకరు వివరించారు.
కర్నూలు టు బెంగళూరు లింక్
ఈ దందా వెనుక ఉన్నది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన నిందితులను కర్నూలు జిల్లాకు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్, షేక్ షారుఖ్‌గా గుర్తించారు. ఆంధ్రాలో ఉన్న ఒక ప్రధాన గంధపుచెక్కల స్మగ్లర్ ఆదేశాల మేరకు వీరు పనిచేస్తున్నట్లు సమాచారం.
బెంగళూరుకు చెందిన రవి అనే స్థానిక రిసీవర్‌కు ఈ కోటిన్నర విలువైన సరుకును అప్పగించడానికి ఈ ఇద్దరు నిందితులు ఆ హోటల్ సమీపంలో కాపు కాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ అంతర్-రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా బెంగళూరు నగరంలో ఇంకా ఏ ఏ స్థాయిలో పాతుకుపోయి ఉంది, వీరికి ఇంకెవరితో సంబంధాలు ఉన్నాయి అనే విషయంపై దర్యాప్తు అధికారులు ఇప్పుడు 'పుష్ప' స్టైల్‌లో కూపీ లాగుతున్నారు. త్వరలోనే ఈ గంధపు దందా మూలాలు బయటపడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications