తెలంగాణ: టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్. కృష్ణయ్య?
హైదరాబాద్: తెలంగాణకు తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిద్ధపడినట్లు అర్థమవుతోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి పదవిని బిసికి ఇస్తామని ప్రకటించిన ఆయన మరో అడుగు ముందుకు వేయనున్నట్లు తెలుస్తోంది.
బిసి నాయకుడిగా రాష్ట్రవ్యాప్త గుర్తింపు ఉన్న ఆర్.కృష్ణయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దానివల్ల బిసిలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీగా పేరు బలపడుతుందని, తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాలకు మరింత చేరువ కావచ్చునని తెలుస్తోంది.

బిసిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడిని ఆర్. కృష్ణయ్య ఆ మధ్య కలిసి మద్దతు ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరలేదు. అతి త్వరలోనే ఆర్.కృష్ణయ్యను చంద్రబాబు నాయుడు లాంఛనంగా పార్టీలో చేర్చుకుని, ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించడం ద్వారా మద్దతు సాధించవచ్చునని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో బీసీ కార్డును వాడుతూ వస్తున్నారు. ఆర్. కృష్ణయ్య బిసీ సంఘాల నేతగా వ్యవవహరిస్తూ వస్తున్నారు. దీంతో ఆ సంఘాల మద్దతు తమ పార్టీకి ఉంటుందని చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు.












Click it and Unblock the Notifications