జగన్‌ను కలిసిన ఆర్ కృష్ణయ్య, చంద్రబాబు తీరుపై ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య బుధవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. హైదరాబాదులోని లోటస్ పాండులో ఆయన జగన్‌ను కలిశారు.
జగన్‌తో భేటీ అనంతరం ఆర్ కృష్ణయ్య విలేకరులతో మాట్లాడారు. బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పారు. పార్లమెంటులో బిల్లు పెట్టేలా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని తాను జగన్‌ను కోరానని చెప్పారు. వారంలో లేఖ రాస్తానని జగన్ హామీ ఇచ్చారన్నారు.
కాపులను బీసీల్లో చేర్చితే బీసీలు బాగా నష్టపోతారని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కాగా, కాపులను బీసీల్లో చేర్చేందుకు చంద్రబాబు కమిటీ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్ కృష్ణయ్య భగ్గుమంటున్నారు.

సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన గల్లా
గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ఎంపీ గల్లా జయదేవ్ బుధవారం నాడు పరిశీలించారు. ఎంపీ వెంట టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
అనుకున్న సమయానికి గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేయాలంటే, జరుగుతున్న పనుల వేగం పెంచాలని ఈ సందర్భంగా ఎంపీ గల్లా సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సూచనల మేరకు ఉదయం తుళ్లూరు మండలంలో పర్యటించారు.
తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయ శ్లాబ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కాంట్రాక్టర్లు మరింత వేగంగా పనులు చేయాల్సి ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications